ఆడుతోంది ఒకే ఒక్క ఫార్మాట్.. ఆదీనూ రెండు నెలల తర్వాత బ్యాట్ పట్టి మైదానంలోకి వచ్చాడు. అలాంటి బ్యాటర్.. పరుగుల వేట కొనసాగిస్తాడని ఎవరైనా అనుకున్నారా? సెంచరీతో రికార్డుల మోత మోగిస్తాడని ఊహించారా? ఇవన్నీ ఒకే ఒక్కడికి సాధ్యం.. అతడే విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఇదే ఊపులో ఎవరికీ సాధ్యం కాదనుకున్న ‘సచిన్ తెందూల్కర్ శత శతకాల (100 Centuries) రికార్డు’ వైపు దూసుకెళ్తున్నాడు. ఆ ఘనతను ఈ పరుగుల యంత్రం అందుకుంటాడా?దీని కోసం అతడికి ఇంకా ఎన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి?
‘‘తన ఖాతాలో ఇప్పటికే 86 అంతర్జాతీయ శతకాలు ఉన్నందున.. అతడు వందో శతకం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అందులో తప్పు లేదు. ఎందుకంటే కోహ్లీ రోల్ మోడల్ సచిన్’’ – అని అజింక్య రహానే అన్నాడు
వన్డేల్లో విరాట్‌కి ఇది 55వ శతకం కాగా.. మొత్తంగా అన్నిఫార్మాట్లూ కలిపితే 86వది. సచిన్ 100 సెంచరీల రికార్డును దాటాలంటే 15 శతకాలు కావాలి. టీ20లు, టెస్టులకు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ వచ్చే వన్డే ప్రపంచకప్పే ఆఖరిదని చెబుతున్నాడు. ఆ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటున్నారు. ‘శత’కాల ఘనత అందుకోవాలంటే.. కోహ్లీకి గరిష్ఠంగా 38 మ్యాచ్‌లు ఉన్నాయి.
గణాంకాల కోసం ఆడితే ఇంతకాలం కొనసాగలేం..: కోహ్లీ
- 2027 ప్రపంచకప్ ముందు టీమ్ ఇండియా నిర్ణీత షెడ్యూల్‌లో భాగంగా 13 వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.
- వచ్చే ఏడాది ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. అందులో భారత్ చివరి వరకూ నిలిస్తే ఆరు మ్యాచ్‌లు ఆడనుంది.
- వరల్డ్ కప్ వచ్చే లోపు భారత్ మరో ఆరు వన్డేలు ఆడేలా బీసీసీఐ రెండు టోర్నీలను నిర్వహించనుందని సమాచారం. ఏ జట్లపై అనేది తేలాల్సి ఉంది.
- 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే.. ఆ టోర్నీలో మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది.
- మొత్తంగా చూస్తే.. కనిష్ఠంగా 32.. గరిష్ఠంగా 38 వన్డే మ్యాచ్‌లు కోహ్లీకి అందుబాటులో ఉంటాయి.
- సచిన్ శత శతకాల రికార్డును అధిగమించాలంటే.. విరాట్ కనీసం ప్రతి ఐదు ఇన్నింగ్స్‌లకు రెండు సెంచరీలు చేయాలి.
- కోహ్లీ గత పది ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. నాలుగు సెంచరీలు చేశాడు. ఒక్కో శతకానికి సరాసరి 2.5 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ ఫ్లో కొనసాగిస్తే 15 శతకాలు రావడం పెద్ద కష్టమేమీ కాదు.
- ప్రస్తుతం అతడి ఫామ్, ఫిట్‌నెస్, పరుగుల దాహం చూస్తుంటే.. అవకాశమున్న ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటును ఝళిపించేలా ఉన్నాడు. ఆ లెక్కన ‘శత’కాల రికార్డు సాధ్యమే అని చెప్పొచ్చు.


