భారత్-A యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి తన బ్యాటింగ్‌తో కాదు, మ్యాచ్ అనంతరం జరిగిన ఒక వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచాడు. శ్రీలంక-Aతో జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన తర్వాత వైభవ్ శ్రీలంక ఆటగాళ్లతో, ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై ICC చర్యలు తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది.
మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్ విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే భారత జట్టు కేవలం 9 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. చివరి మూడు బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఒక ఫోర్‌తో సహా, 6 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. వరుసగా రెండో ఓటమి ఎదురుకావడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.
మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు విజయాన్ని సంబరంగా జరుపుకుంటుండగా, నిరాశతో మైదానం వీడుతున్న వైభవ్ ఒక్కసారిగా బౌలర్ కగుతాస్ మతులన్ వైపు వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో పరిస్థితిని చల్లార్చేందుకు శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగే మధ్యలోకి రావడంతో వైభవ్ అతడిని తోసినట్లు వీడియోలో కనిపించింది.
దాంతో మరికొంతమంది ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండగా, శ్రీలంక సీనియర్ ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశాడు. దీంతో పెద్ద వివాదం తలెత్తకుండా ముగిసింది. అయినప్పటికీ ఈ ఘటన ఇప్పుడు ICC దృష్టికి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ICC కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 ప్రకారం మరో ఆటగాడితో, అనుచిత శారీరక సంపర్కం జరపడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ కేసులో వైభవ్ చర్య ఉద్దేశపూర్వకమా, ఎంత తీవ్రంగా జరిగింది, ఎవరికైనా గాయమైందా వంటి అంశాలను మ్యాచ్ రిఫరీ పరిశీలిస్తారు.
ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే, ఇది సాధారణంగా లెవల్-1 నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి సందర్భంలో మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, ఒకటి లేదా రెండు డిమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది. అయితే ఘటన తీవ్రత తక్కువగా ఉందని భావిస్తే కేవలం హెచ్చరికతో కూడా సరిపెట్టవచ్చు.
ప్రస్తుతం మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. అందువల్ల వైభవ్ సూర్యవంశీపై నిజంగా శిక్ష పడుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే భారత క్రికెట్‌లో భవిష్యత్ స్టార్‌గా భావిస్తున్న ఈ యువ ఆటగాడికి, ఈ ఘటన ఒక ముఖ్యమైన పాఠంగా మారే అవకాశం ఉంది.


