Top 5 This Week

Related Posts

ఇంగ్లండ్‌కు షాక్.. టెస్ట్ కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ ఔట్!

ఇంగ్లండ్ క్రికెట్‌లో భారీ మార్పు చోటుచేసుకుంది. గత నాలుగేళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో “బాజ్‌బాల్” అనే దూకుడు ఆటతీరుకు గుర్తుగా నిలిచిన బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తొలగించింది. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. అయితే వన్డే, టీ twenty జట్ల కోచ్‌గా మాత్రం మెకల్లమ్ కొనసాగనున్నాడు. 2022 లో బ్రెండన్ మెకల్లమ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి “బాజ్‌బాల్” అనే కొత్త శైలిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎంత పెద్ద లక్ష్యమైనా భయపడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడం, వేగంగా పరుగులు చేయడం, ఎప్పుడూ గెలుపు కోసమే ఆడటం ఈ విధానంలోని ప్రధాన లక్షణాలు.

ఆరంభంలో ఈ వ్యూహం అద్భుత ఫలితాలను ఇచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్, భారత్‌పై వరుస విజయాలు, పాకిస్థాన్ గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. టెస్ట్ క్రికెట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చిన కోచ్‌గా మెకల్లమ్ ప్రశంసలు అందుకున్నాడు. అయితే కాలక్రమేణా బాజ్‌బాల్ బలహీనతలు బయటపడడం ప్రారంభమైంది. ప్రతి పరిస్థితిలో ఒకే విధమైన దూకుడు ఆటతీరును అనుసరించడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా బలమైన జట్లపై అదే వ్యూహం ఫలించలేదు. ఇటీవలి నెలల్లో ఇంగ్లండ్ వరుసగా ఎదురుదెబ్బలు తిన్నది.

ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా 1 – 2 తో సిరీస్‌ను కోల్పోయింది. ఈ ఫలితాలతో జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఇటీవల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. కెప్టెన్ మార్పు, వరుస ఓటములు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడం వంటి కారణాలతో ECB కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బ్రెండన్ మెకల్లమ్ స్పందిస్తూ, “టెస్ట్ జట్టుతో కొనసాగలేకపోవడం బాధగా ఉంది. కానీ బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఇకపై నా పూర్తి దృష్టి వైట్‌బాల్ జట్లపైనే ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ విజయాల కోసం కృషి చేస్తాను” అని తెలిపాడు.

ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ… వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్‌ను గెలవాలంటే ఇప్పుడే మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిజానికి మెకల్లమ్ ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్‌పై చాలా పెద్దది. 2015 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా అతను చూపించిన దూకుడు ఆటతీరు అప్పటి నుంచి ఇంగ్లండ్‌ను ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ వైట్‌బాల్ క్రికెట్‌లో ప్రపంచకప్ గెలవడం కూడా అదే ఆలోచనా విధానానికి కొనసాగింపుగా చెప్పవచ్చు. టెస్ట్ క్రికెట్‌లో కూడా మెకల్లమ్ అదే దూకుడు శైలిని తీసుకొచ్చాడు. జో రూట్ వంటి బ్యాటర్ల ఆటలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. భారీ లక్ష్యాలను సైతం చేధించే ధైర్యాన్ని జట్టుకు ఇచ్చాడు. అయితే భారత్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై మాత్రం బాజ్‌బాల్ పెద్దగా పనిచేయలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా ఇంగ్లండ్ చేరలేకపోయింది.

ముఖ్యంగా గత ఏడాది శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత జట్టు ఇంగ్లండ్ బాజ్‌బాల్ వ్యూహాన్ని సమర్థంగా ఎదుర్కొంది. ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉందని నిరూపించింది. అప్పటి నుంచే బాజ్‌బాల్‌పై ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడు మెకల్లమ్ టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో “బాజ్‌బాల్” శకానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది. ఇక ఇంగ్లండ్ కొత్త కోచ్‌తో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles