భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి క్రికెట్ మైదానంలో కాదు.. ప్రపంచ ప్రఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2026 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లండన్‌లోని సెంటర్ కోర్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ హైప్రొఫైల్ ఫైనల్‌ను చూసేందుకు భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ హాజరయ్యాడు. బ్లాక్ బ్లేజర్, వైట్ షర్ట్, స్ట్రైప్ టై, సన్‌గ్లాసెస్‌తో వైభవ్ ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు.
అతని లుక్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ, తన క్రికెట్ జీవితంలో యువరాజ్ సింగ్ ఎంత పెద్ద స్ఫూర్తో చెప్పుకొచ్చాడు. “యువరాజ్ సింగ్ నా ఐడల్. ఆయనను మొదటిసారి కలిసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆయనతో చాలా విషయాలు మాట్లాడాను. నా ఆట గురించి, భవిష్యత్తు గురించి ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన నుంచి ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఇవన్నీ నా భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని నమ్ముతున్నాను” అని వైభవ్ తెలిపాడు.
వైభవ్ మాటలు విన్న అభిమానులు యువరాజ్ సింగ్ యువ ఆటగాళ్లకు ఎంత మంచి మార్గదర్శకుడో మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో అభిషేక్ శర్మ కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు. “వైభవ్ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో నాకు బాగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒకప్పుడు యువరాజ్ సింగ్ నాకు కూడా ఐడల్. నేను ఆయనను మొదటిసారి కలిసినప్పుడు కూడా ఇలాగే చాలా ఆనందంగా ఫీలయ్యాను. ఇప్పుడు వింబుల్డన్ ఫైనల్‌ను యువీ పాజీతో కలిసి చూడటం నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు” అని అభిషేక్ చెప్పాడు. ఈ సందర్భంగా వైభవ్ తన డ్రెస్ గురించి కూడా ఒక సరదా విషయము చెప్పాడు. వింబుల్డన్‌కు వెళ్లే ముందు ప్రత్యేకంగా ఎలాంటి ప్లానింగ్ చేయలేదని చెప్పిన వైభవ్, చివరి నిమిషంలో అభిషేక్ శర్మే తనకు డ్రెస్ ఏర్పాటు చేశాడని నవ్వుతూ తెలిపాడు. “ప్రత్యేకంగా ఏమీ ప్లాన్ చేయలేదు. చివరి నిమిషంలో ఏది దొరికిందో అదే వేసుకున్నాను.
అభిషేక్ అన్నను అడిగితే ఆయన నా కోసం ఈ డ్రెస్ ఏర్పాటు చేశారు. వెంటనే వేసుకుని వచ్చేశాను” అని వైభవ్ నవ్వుతూ చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీ వినయం, యువరాజ్ సింగ్‌పై అతనికి ఉన్న గౌరవం అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే తన ప్రతిభతో భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్, ఇప్పుడు మైదానంలోనే కాదు, తన మాటలతో కూడా అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు. మరోవైపు యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజ ఆటగాడి మార్గదర్శకత్వం, వైభవ్ కెరీర్‌కు మరింత బలాన్ని ఇవ్వొచ్చని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ముందు ముందు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో, మరెన్నో విజయాలు సాధించాలని అందరూ ఆశిస్తున్నారు.


