యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశిపై మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గతంలో తాను చేసిన “డ్రింక్స్ సర్వ్ చేయొచ్చు” అనే వ్యాఖ్యను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని అశ్విన్ తాజాగా స్పష్టం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్… “వైభవ్ సూర్యవంశి జట్టులో ఉంటే డ్రింక్స్ సర్వ్ చేయొచ్చు, బయట కూర్చోవచ్చు అని నేను చెప్పాను. కానీ ఆ మాటను ఎవరినీ తక్కువ చేసి చెప్పలేదు.
నా ఉద్దేశం పూర్తిగా వేరు” అని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ… “వైభవ్ ఇంకా చాలా చిన్నవాడు. అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాకపోయినా, బయట నుంచి మ్యాచ్‌ను గమనిస్తే ఎంతో అనుభవం వస్తుంది. సీనియర్ ఆటగాళ్లను దగ్గరగా చూస్తూ చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను అలా చెప్పాను. అతన్ని జట్టులో నుంచి తీసేయాలని లేదా ఆడించొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు. అతనికి సమయం ఇవ్వాలి. ఎదగనివ్వాలి. భవిష్యత్తులో అతను అద్భుతమైన ఆటగాడిగా మారతాడు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ twenty సిరీస్‌లో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తన అంతర్జాతీయ అరంగేట్ర సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే జింబాబ్వేతో జరిగిన తర్వాతి టీ twenty సిరీస్‌లో వైభవ్ అద్భుతంగా పుంజుకున్నాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో మ్యాచ్‌లో 20 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లో అద్భుతంగా 81 పరుగులు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 151 పరుగులు చేసిన వైభవ్… 50.33 సగటుతో, 196కు పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ షార్ట్ బాల్స్‌కు, ఇబ్బంది పడిన విషయంపైనా అశ్విన్ స్పందించాడు. “షార్ట్ బాల్స్‌కు ఎప్పుడూ ఔట్ కాని బ్యాటర్ ఎవరైనా ఉన్నారా? రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా షార్ట్ బాల్స్‌కు ఔట్ అయ్యారు.
ప్రతి ఆటగాడికి బలాలు ఉంటాయి. బలహీనతలు కూడా ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది చాలా సహజం. మన బలాలను చూపించాలి. బలహీనతలను గుర్తించి వాటిపై కష్టపడాలి. ఇవన్నీ అనుభవంతోనే వస్తాయి” అని అశ్విన్ చెప్పాడు. అంతేకాకుండా… “వైభవ్ జోఫ్రా ఆర్చర్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను ఎన్ని సార్లు ఎదుర్కొన్నాడు? అలాంటి మ్యాచ్‌లు అతనికి మంచి అనుభవాన్ని ఇస్తాయి. ఒకటి రెండు మ్యాచ్‌ల ఆధారంగా అతని కెరీర్‌కు ఇప్పుడే ముగింపు రాయలేం. అంత తొందరగా ఎవరినీ తేల్చేయకూడదు” అని అశ్విన్ స్పష్టం చేశాడు. అశ్విన్ మరో ఆసక్తికర విషయము కూడా చెప్పాడు. “వైభవ్ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడటంతో అతనిపై అందరి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రతి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలా ఆడాలని అందరూ ఆశిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయి. క్రికెట్‌లో కూడా విజయాలు, వైఫల్యాలు సహజం. కాబట్టి వైభవ్‌కు సమయం ఇవ్వాలి” అని పేర్కొన్నాడు.


