టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మరో కీలక మార్పు జరిగింది. భారత జట్టు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్‌ను బీసీసీఐ నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన టీ దిలీప్ కాంట్రాక్ట్ ముగియడంతో, అతనికి మరోసారి పొడిగింపు ఇవ్వకుండా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగిన వైట్ బాల్ సిరీస్‌తో టీ దిలీప్ ఒప్పందం ముగిసింది. ఆ తర్వాత కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. సీనియర్ భారత జట్టుతో ఆయన తొలి అసైన్‌మెంట్ శ్రీలంకతో ఆగస్టులో జరిగే రెండు టెస్టుల సిరీస్ కానుంది. అయితే ఈ సుభదీప్ ఘోష్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సుభదీప్ ఘోష్ అసోంకు చెందిన మాజీ దేశవాళీ క్రికెటర్. 1968లో అసోంలోని డిగ్బోయ్‌లో జన్మించారు.
ఆయన కుడిచేతి మధ్యతరగతి బ్యాటర్‌గా, అలాగే ఆఫ్ స్పిన్ బౌలర్‌గా దేశవాళీ క్రికెట్‌లో ఆడారు. తన క్రికెట్ కెరీర్‌లో అసోం, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 316 పరుగులు చేశారు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో 17 మ్యాచ్‌లు ఆడి 307 పరుగులు నమోదు చేశారు. 1994-95 సీజన్‌లో ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఘోష్, 2004లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడగా, 2005లో చివరి లిస్ట్-ఏ మ్యాచ్ ఆడి తన ఆటగాడి కెరీర్‌కు ముగింపు పలికారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచింగ్ వైపు అడుగులు వేశారు.
గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీ, అంటే ఎన్‌సీఏలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన అక్కడే పనిచేశారు. అంతేకాదు… భారత క్రికెట్‌లో వివిధ వయసు విభాగాల జట్లతో కలిసి పనిచేసి మంచి అనుభవం సంపాదించారు. అండర్ 19 జట్టు, ఇండియా-ఏ జట్టుతో పాటు యువ ఆటగాళ్ల అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2021లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా సుభదీప్ ఘోష్ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశారు.
అలాగే 2024 అండర్ 19 వరల్డ్ కప్ సందర్భంగా దక్షిణాఫ్రికాలో భారత అండర్ 19 జట్టుతో కలిసి సేవలందించారు. ఐపీఎల్‌లో కూడా ఆయనకు మంచి అనుభవం ఉంది. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నారు. అదే ఏడాది కేకేఆర్ రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. ఇప్పుడు ఇలాంటి అనుభవజ్ఞుడైన కోచ్‌ను భారత సీనియర్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. టీ దిలీప్ హయాంలో భారత జట్టు ఫీల్డింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే స్థాయిని కొనసాగించడంతో పాటు, మరింత మెరుగైన ఫలితాలు అందించాలని సుభదీప్ ఘోష్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

