దులీప్ ట్రోఫీ 2026-27 టైటిల్‌ను ఈస్ట్ జోన్ గెలుచుకుంది. ఈ విజయానికి కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో భారీగా పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ టోర్నీలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు మాత్రం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి. ఫైనల్‌లో వైభవ్ తన స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయలేకపోయినా.. ఈ టోర్నీలో అతని బ్యాటింగ్‌తో పాటు, కెప్టెన్సీ విషయంలో చూపించిన తెలివి కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈస్ట్ జోన్‌కు వైభవ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒక సమయంలో ఇషాన్ కిషన్ గాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లడంతో.. కెప్టెన్ బాధ్యతలు వైభవ్ తీసుకున్నాడు.
అప్పుడు DRS విషయంలో వైభవ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఫైనల్‌లో కూడా రివ్యూ తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైభవ్ కీలకంగా మారాడు. ఫైనల్‌లో వైభవ్ ఇషాన్‌ను రివ్యూ తీసుకోవాలని ఒప్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ రివ్యూ సరైనదిగా తేలడంతో.. వైభవ్ పేరు మరింత వైరల్ అయింది. అయితే BCCI షేర్ చేసిన ఒక వీడియోలో ఇషాన్ కిషన్ సరదాగా వైభవ్‌ను ఆటపట్టించాడు. తాను ఇప్పటికే రివ్యూ తీసుకోవాలని అనుకున్నప్పటికీ.. వైభవ్ తన దగ్గరకు వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేవాడని ఇషాన్ అన్నాడు. కానీ చివరికి ఇంటర్నెట్‌లో మాత్రం రివ్యూ క్రెడిట్ మొత్తం వైభవ్‌కే వెళ్లిపోయిందని నవ్వుతూ చెప్పాడు.
అంతే కాదు.. వైభవ్ తన పాత్రను చాలా బాగా చేశాడని ఇషాన్ ప్రశంసించాడు. దీనికి వైభవ్ కూడా వెంటనే అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. “మీరు ఫీల్డ్ బయటకు వెళ్లినప్పుడు రివ్యూలు ఎవరు తీసుకున్నారు? అది కూడా చెప్పండి” అంటూ తన కెప్టెన్‌కే కౌంటర్ ఇచ్చాడు. వైభవ్ ఇచ్చిన ఈ witty reply ఇప్పుడు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇషాన్ కూడా వైభవ్‌లో ఉన్న ఈ నాయకత్వ లక్షణాలను ప్రశంసించాడు. భవిష్యత్తులో అతను కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉందేమో అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అంతేకాదు.. వైభవ్ చాలా చిన్న వయసులోనే టీమ్‌లోని ప్రతి ఒక్కరిని చూసుకునే వ్యక్తిగా మారాడని ఇషాన్ చెప్పాడు.
జూనియర్ అయినా, సీనియర్ అయినా అందరితో కలిసిపోయే గుణం వైభవ్‌లో ఉందని ప్రశంసించాడు. మ్యాచ్ సమయంలో కామెంటేటర్లు కూడా DRS తీసుకోవాలంటే వైభవ్ దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారని ఇషాన్ గుర్తు చేశాడు. ఇక వైభవ్ గురించి ఇషాన్ మరో ఆసక్తికరమైన విషయము చెప్పాడు. ఇప్పుడున్న స్థాయితో అతను ఆగిపోడని.. భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేస్తాడని నమ్మకం వ్యక్తం చేశాడు. అంటే.. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా.. మైదానంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చూపిస్తున్నాడన్నమాట. మరి వైభవ్ సూర్యవంశి నిజంగానే భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్‌గా మారతాడా? చూడాలి!


