Top 5 This Week

Related Posts

“సింక్‌లో లేను”.. శ్రీలంక సిరీస్‌లో తన వైఫల్యంపై మహ్మద్ సిరాజ్ బిగ్ కామెంట్స్!

శ్రీలంక టూర్‌లో తన బౌలింగ్‌లో వేగం, రిథమ్ ఎందుకు తగ్గిపోయాయో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తాజాగా వెల్లడించాడు. అయితే డులీప్ ట్రోఫీలో సుదీర్ఘంగా బౌలింగ్ చేయడంతో ఇప్పుడు మళ్లీ తన పాత రిథమ్‌లోకి వచ్చానని సిరాజ్ చెప్పాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ తన సాధారణ వేగంతో బౌలింగ్ చేయలేకపోయాడు. సాధారణంగా గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసే సిరాజ్.. అక్కడ 120ల చివరి వేగంతోనే బౌలింగ్ చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 44 ఓవర్లు వేసినా.. బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. దీనికి అసలు కారణం ఏంటో సిరాజ్ స్వయంగా చెప్పాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ ముగిసిన తర్వాత తాను రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నానని.. ఆ తర్వాత నేరుగా మ్యాచ్‌లోకి రావడంతో తన రిథమ్ పూర్తిగా సెట్ కాలేదని సిరాజ్ తెలిపాడు. తన బౌలింగ్ మొత్తం రిథమ్‌పైనే ఆధారపడి ఉంటుందని.. రన్‌అప్‌లో చిన్న తేడా వచ్చినా బంతిలో తన సహజమైన వేగం కనిపించదని చెప్పాడు. శ్రీలంకలో తన రన్‌అప్ కూడా సరిగ్గా సెట్ కాలేదని సిరాజ్ వివరించాడు. కొన్ని అడుగులు చిన్నగా, మరికొన్ని పెద్దగా పడటంతో తన బౌలింగ్ ఫ్లో దెబ్బతిని వేగం తగ్గిపోయిందని చెప్పాడు. అయితే డులీప్ ట్రోఫీ ఫైనల్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

సౌత్ జోన్ తరఫున ఆడిన సిరాజ్.. ఏకంగా 41 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఎక్కువ ఓవర్లు వేయడంతో తన శరీరం మళ్లీ బౌలింగ్‌కు అలవాటు పడిందని.. తన పాత రిథమ్ తిరిగి వచ్చిందని సిరాజ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసి 140 పరుగులు ఇచ్చిన సిరాజ్‌కు వెంటనే వికెట్లు రాలేదు. కానీ తన లక్ష్యం వికెట్లు తీయడం కాదని.. ముందుగా తన బౌలింగ్ రిథమ్‌ను తిరిగి పొందడమే అని చెప్పాడు. రెండు నెలల బ్రేక్ తర్వాత శరీరం కొంచెం స్లోగా అనిపించిందని.. 10, 11 ఓవర్ల సుదీర్ఘ స్పెల్స్ వేయడంతో మళ్లీ తన బాడీ బౌలింగ్‌కు పూర్తిగా సెట్ అయిందని సిరాజ్ చెప్పాడు.

తన 10 ఏళ్ల కెరీర్‌లో ఇంతవరకు రెండు నెలల పూర్తి బ్రేక్ తీసుకోలేదని సిరాజ్ వెల్లడించాడు. తన శరీరం ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసినప్పుడే మరింత బాగా పనిచేస్తుందని చెప్పాడు. ఇక డులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సిరాజ్‌కు మహ్మద్ షమీతో మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ సహజమైన రిథమ్‌లో బౌలింగ్ చేయలేకపోతున్నాడని షమీ గమనించాడు. తన బేసిక్ బలాలపై దృష్టి పెట్టాలని సిరాజ్‌కు సూచించాడు. రన్‌అప్, రిథమ్ సరిగ్గా ఉంటే లైన్, లెంగ్త్ కూడా ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయని షమీ చెప్పాడు. ఇప్పుడు సిరాజ్ తన పాత రిథమ్‌ను తిరిగి అందుకున్నాడు. మరి ఈ ఫామ్‌ను న్యూజిలాండ్ టూర్‌లో కూడా కొనసాగించి టీమిండియాకు కీలక పేసర్‌గా మారతాడా అనేది చూడాలి. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles