టీమిండియా అభిమానులకు ఒక కీలక అప్డేట్. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే అనధికారికంగా చర్చలు జరిపింది. త్వరలో అధికారిక సమావేశం నిర్వహించి జట్టును ఖరారు చేయనుంది. అయితే ప్రస్తుతం సెలెక్టర్ల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సుందర్ కుడి కాలి హామ్‌స్ట్రింగ్‌కు గాయమైంది.
దీంతో లార్డ్స్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు కూడా అతను దూరమయ్యాడు. బీసీసీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం సుందర్‌కు రైట్ హామ్‌స్ట్రింగ్ ఇంజరీ ఉంది. మొదట నొప్పి కొంత తగ్గినప్పటికీ వైద్యుల సూచన మేరకు స్కాన్లు నిర్వహించారు. ఆ నివేదికలను నిపుణులకు పంపి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇది చిన్న స్థాయి గాయం అయినా, పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి, కనీసం రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. భారత జట్టు ఆగస్టు 4 నుంచే శ్రీలంకకు వెళ్లే అవకాశం ఉంది.
టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు నాలుగు రోజుల వార్మ్-అప్ మ్యాచ్ కూడా ఆడనుంది. అందువల్ల అప్పటికి సుందర్ పూర్తిగా ఫిట్ అవుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అదే కారణంగా సెలెక్టర్లు కూడా అతని విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి వేచి చూస్తున్నారు. గత నెల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోతే హర్ష్ దూబేను కొనసాగిస్తారా? లేక ఆఫ్ స్పిన్నర్ శరాంశ్ జైన్‌కు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు లేకపోయినా, ఆల్‌రౌండర్ల ఎంపికపై మాత్రం సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పునరావాసంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు.
అతడిని తీసుకుంటారా? లేక ప్రత్యేక ఆటగాడిని ఎంపిక చేస్తారా? అన్నది కూడా ఆసక్తిగా మారింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన, తర్వాత టెస్టుల్లో భారత్ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను సజీవంగా, ఉంచుకోవాలంటే శ్రీలంక పర్యటనలో తప్పకుండా మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే జట్టుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.


