Top 5 This Week

Related Posts

ట్రోఫీ వివాదం మళ్లీ మొదలవుతుందా? మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు మొహ్సిన్ నక్వీ!

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే టెన్షన్… అలాంటిది ఇప్పుడు మరోసారి ట్రోఫీ వివాదం వస్తుందా? మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌కు ముందు ఇదే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ… సెప్టెంబర్ 13న దుబాయ్‌లో జరగబోయే ఫైనల్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. ఇండియా ఫైనల్‌కు చేరి, ట్రోఫీ గెలిస్తే… ట్రోఫీని మొహ్సిన్ నక్వీ అందించే అవకాశం ఉంది. ఇక్కడే గత ఏడాది జరిగిన ఘటన మళ్లీ గుర్తుకు వస్తోంది.

2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. అయితే భారత జట్టు మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ గంటకు పైగా ఆలస్యమైంది. చివరికి భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నక్వీ మాత్రం ట్రోఫీతో స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఆ ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ భారత్‌కు అందలేదని, దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉందని సమాచారం.

ఇప్పుడు మహిళల ఆసియా కప్‌లో కూడా ఇదే పరిస్థితి వస్తుందా అనే చర్చ మొదలైంది. మహిళల ఆసియా కప్ ఏసీసీ ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహ్సిన్ నక్వీకి విజేతలకు ట్రోఫీ అందించే అవకాశం ఉంది. అయితే భారత్ ఫైనల్ గెలిస్తే… నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలా వద్దా అనేది హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టే నిర్ణయించాల్సి ఉంటుంది. దీనిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక టోర్నీలో టీమిండియా అదరగొడుతోంది.

థాయ్‌లాండ్, హాంకాంగ్, పాకిస్థాన్‌పై వరుస విజయాలు సాధించి… ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా సెమీఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అంతేకాదు… స్మృతి మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి మరో రికార్డు కూడా సృష్టించింది. మరి సెప్టెంబర్ 13న భారత్ ఫైనల్‌కు చేరి టైటిల్ గెలిస్తే… మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటుందా? లేక గత ఏడాది లాగే మరోసారి ట్రోఫీ వివాదం జరుగుతుందా? దుబాయ్‌లో జరిగే ఫైనల్‌పై ఇప్పుడు అందరి చూపు ఉంది! 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles