Top 5 This Week

Related Posts

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి సెకండ్ ఇన్నింగ్స్.. ఇంకా సగం కెరీర్‌ మాత్రమే మిగిలిందా?

29 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి… ఇప్పుడు 35 ఏళ్ల వయసులో కూడా తన కెరీర్‌లో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెబుతున్నాడు! సాధారణంగా 35 ఏళ్ల వయసు అంటే చాలా మంది క్రికెటర్లకు కెరీర్ చివరి దశగా భావిస్తారు. కానీ వరుణ్ మాత్రం తనను తాను ఇంకా కెరీర్ మొదటి భాగంలోనే ఉన్నానని అనుకుంటున్నాడు. అసలు ఎందుకంటే? గత ఏడాది వరుణ్‌కు ఒక రోలర్‌కోస్టర్‌లా సాగింది. సొంత గడ్డపై జరిగిన T20 వరల్డ్‌కప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా గాయాలతోనే ఆడాడు. చేతికి, కాలికి చిన్న చిన్న ఫ్రాక్చర్లు ఉన్నప్పటికీ ఆటను కొనసాగించాడు. అయితే ఇంగ్లండ్‌తో T20 సిరీస్ సమయంలో తొలిసారి కండరాల గాయం, కావడంతో కొన్ని వారాలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఈ గాయం కూడా తనకు ఒక కొత్త అనుభవమే అంటున్నాడు వరుణ్. ఇప్పటివరకు తనకు వచ్చిన గాయాలు ఎక్కువగా మైదానంలో, జరిగిన ప్రమాదాలు లేదా దెబ్బల వల్ల వచ్చినవేనని చెప్పాడు. కానీ ఈసారి వచ్చిన హ్యామ్‌స్ట్రింగ్ గాయం పూర్తిగా కొత్త అనుభవమని తెలిపాడు.

దీంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చాలా సమయం గడిపాడు. అక్కడ రన్నింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో పాటు తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా పని చేశాడు. అయితే గాయం తగ్గడం ఒక్కటే సరిపోదు. మళ్లీ బౌలింగ్ చేసేటప్పుడు తన శరీరంపై పూర్తి నమ్మకం రావాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే తన బౌలింగ్‌లో మరింత స్వేచ్ఛగా కొత్త ప్రయోగాలు చేయగలనని వరుణ్ చెబుతున్నాడు. అంతేకాదు… ఆటకు దూరంగా ఉండే సమయాన్ని కూడా వృథా చేయకూడదని అతని ఆలోచన. మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు దొరకని సమయాన్ని ఉపయోగించుకుని తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చని అంటున్నాడు.

వరుణ్ బౌలింగ్‌లో మిస్టరీ గురించి అందరూ మాట్లాడుతుంటారు. కానీ అతని దృష్టిలో ఒక స్పిన్నర్‌కు అత్యంత ముఖ్యమైన పరికరం మాత్రం షూస్! బంతి వేసిన తర్వాత స్పిన్నర్లు ఎక్కువగా పివట్ అవుతారు కాబట్టి, కాలి ముందు భాగంలో కొంచెం వెడల్పుగా ఉండే షూస్ చాలా ముఖ్యమని వరుణ్ చెబుతున్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ పూర్తిగా కోలుకుని మళ్లీ టీమిండియాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుగా ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు T20 లు, ఆ తర్వాత జపాన్‌తో ప్రత్యేక మ్యాచ్, అలాగే ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున ఆడే అవకాశం అతని ముందుంది. ముఖ్యంగా ఆసియా గేమ్స్ వరుణ్‌కు కొత్త అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి.

ఎందుకంటే క్రికెట్ మాత్రమే కాదు… వివిధ క్రీడలకు చెందిన అథ్లెట్లను దగ్గరగా చూసే అవకాశం కూడా అతనికి మొదటిసారి వస్తోంది. 100 మీటర్ల రన్నర్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు? బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎలా సిద్ధమవుతాడు? ఇవన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి తనకు ఉందని వరుణ్ చెబుతున్నాడు. అంటే… 35 ఏళ్ల వయసులో కూడా వరుణ్ చక్రవర్తి ప్రయాణం ఇంకా పూర్తికాలేదు. తన మాటల్లో చెప్పాలంటే… అతని కెరీర్ ఇంకా మొదటి సగంలోనే ఉంది!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles