Top 5 This Week

Related Posts

టైఫూన్ దుజువాన్ ఎఫెక్ట్.. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్! ష్రేయాస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

జపాన్‌తో చారిత్రాత్మక T20 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టైఫూన్ దుజువాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు రావడంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. దీంతో జపాన్‌తో మ్యాచ్‌కు ముందు చివరిసారిగా పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం భారత ఆటగాళ్లకు లేకుండా పోయింది. మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్ సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత్, జపాన్ పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి తలపడుతున్నాయి. భారత్-జపాన్ దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.

అయితే మ్యాచ్‌కు ముందు నుంచే వాతావరణం సమస్యగా మారింది. టైఫూన్ దుజువాన్ జపాన్ తూర్పు ప్రాంతం వైపు కదులుతుండటంతో భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతున్నాయి. టోక్యోతో పాటు కాంటో ప్రాంతంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం నుంచి కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ వాతావరణ ప్రభావం ఏషియన్ గేమ్స్‌పై కూడా పడింది.

అచి-నాగోయా ఏషియన్ గేమ్స్‌లో భాగంగా జరగాల్సిన ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌ను కూడా ముందుజాగ్రత్తగా వాయిదా వేశారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ప్రాక్టీస్ లేకుండానే తొలి మ్యాచ్‌కు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జపాన్‌లోని పిచ్ ఎలా ఉంటుంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే విషయాలపై భారత జట్టుకు పెద్దగా అవగాహన లేదు. టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. జపాన్‌లో తమకు లభించిన ఆతిథ్యం చాలా బాగుందని, అక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా, సహాయకంగా ఉన్నారని అయ్యర్ తెలిపాడు.

అయితే మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. జపాన్‌తో తొలిసారి ఆడుతున్నామని, అక్కడి పరిస్థితులు, వికెట్ గురించి తమకు పెద్దగా తెలియదని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. అయినా ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్ టీమిండియాకు మరో కారణంతో కూడా కీలకం. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్‌కు ముందు ఇదే భారత్‌కు చివరి ప్రాక్టీస్ మ్యాచ్. ప్రస్తుతం భారత్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు జపాన్ T20 ర్యాంకింగ్స్‌లో 41వ స్థానంలో ఉంది. అయితే జపాన్ మాత్రం ఈ మ్యాచ్‌ను కేవలం సెలబ్రేషన్‌గా చూడటం లేదు. భారతలాంటి పెద్ద జట్టుతో స్వదేశంలో ఆడే అవకాశం రావడంతో తమ సామర్థ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. మరి ప్రాక్టీస్‌కు టైఫూన్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో.. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్, జపాన్‌లో ఎవరు ఎలా రాణిస్తారో చూడాలి. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles