ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 23,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదు.. ఈ రికార్డును చేరుకోవడంలో సచిన్ టెండూల్కర్‌ను కూడా జో రూట్ దాటేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ రెండో వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. డర్హమ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జో రూట్‌కు 23,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం. తనకు అలవాటైన స్టైల్‌లోనే రూట్ బౌలర్ వేసిన బంతిని తన మణికట్టు సాయంతో ఫ్లిక్ చేసి బౌండరీకి పంపించాడు.
దీంతో అతను 23,000 అంతర్జాతీయ పరుగులను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి జో రూట్‌కు 521 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందున్నాడు. కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. 23,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లతో పాటు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్ ఉన్నారు.
జో రూట్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన కొన్ని రికార్డులను దాటేశాడు. ఇటీవల అత్యధిక టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడి రికార్డును కూడా రూట్ తన పేరుతో రాసుకున్నాడు. అయితే రూట్ ముందున్న అతిపెద్ద లక్ష్యం మాత్రం సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు. ప్రస్తుతం రూట్ 14,278 టెస్ట్ పరుగులతో ఉన్నాడు. సచిన్ 15,921 పరుగులతో ముందున్నాడు. అంటే సచిన్ రికార్డును అందుకోవడానికి రూట్ ఇంకా 1,643 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే సచిన్ 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రికార్డుకు కూడా రూట్ ఇంకా 31 మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.
డిసెంబర్‌లో 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న జో రూట్.. ఇంత వయసులో కూడా తన బ్యాటింగ్‌తో అదరగొడుతూనే ఉన్నాడు. వన్డేల్లో కూడా అతని రికార్డు చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు రూట్ 7,826 వన్డే పరుగులు చేశాడు. 51కు పైగా బ్యాటింగ్ సగటుతో పాటు 20 సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇప్పటికే వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అయితే శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో రూట్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రీలంక అరంగేట్ర బౌలర్ సచిందు కొలంబేజ్ రూట్‌ను ఔట్ చేసి తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించాడు.
చివరికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, విల్ జాక్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. అతను 46 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు 5 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక శ్రీలంక 176 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ తొలి వన్డేను గెలుచుకుంది. అంతకుముందు జరిగిన T20 సిరీస్‌ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మరి జో రూట్.. భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ టెస్ట్ పరుగుల రికార్డును కూడా దాటగలడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో చెప్పండి.


