భారత్-జపాన్ మధ్య జరిగిన T20 మ్యాచ్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది! వర్షం కారణంగా కేవలం 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో జపాన్‌పై విజయం సాధించింది. అయితే మ్యాచ్ చివర్లో జరిగిన ఒక వైడ్ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జపాన్ విజయానికి 33 పరుగులు చేయాల్సి వచ్చింది. జపాన్ ఛేజింగ్‌లో చివరి ఓవర్‌కు వచ్చేసరికి 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉంది. అంటే మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠగా మారిపోయింది.
అప్పుడు జపాన్ బ్యాటర్ అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రివర్స్ హిట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అతను బంతిని మిస్ చేశాడు. ఆ బంతి లెగ్ సైడ్‌లో చాలా దూరంగా వెళ్లడంతో అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. తర్వాతి బంతికి కూడా దాదాపు ఇదే జరిగింది. బ్యాటర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు, బంతిని మిస్ చేశాడు. అంపైర్ మరోసారి వైడ్ ఇచ్చాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది! రెండో వైడ్ నిర్ణయంపై అక్షర్ పటేల్, భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంపైర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత అంపైర్ లెగ్ అంపైర్ క్రిస్ బ్రౌన్‌తో చర్చించారు. చర్చ తర్వాత ముందుగా ఇచ్చిన వైడ్ నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకున్నారు! దీంతో జపాన్‌కు 3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ తర్వాత జపాన్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.
మిగిలిన మూడు బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి జపాన్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో T20 క్రికెట్లో అత్యల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్న జట్టుగా భారత్ ఒక రికార్డు కూడా నమోదు చేసింది. అంతేకాదు, భారత్-జపాన్ మధ్య జరిగిన తొలి పురుషుల T20 మ్యాచ్ ఇదే. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే… అసలు ఆ బంతిని వైడ్‌గా ఇవ్వాలా? లేక అంపైర్ నిర్ణయం మార్చడం సరైనదేనా? MCC క్రికెట్ చట్టం ప్రకారం, బ్యాటర్ తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల బంతి అతనికి వైడ్‌గా వెళ్లే పరిస్థితి ఏర్పడితే, అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించకపోవచ్చు.
అంటే బ్యాటర్ స్వయంగా ముందుకు లేదా పక్కకు కదిలి బంతిని దూరంగా వెళ్లేలా చేస్తే, ఆ బంతిని వైడ్‌గా పరిగణించకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ లాంటి షాట్ల గురించి MCC నిబంధనల్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్‌కు కొంత నిర్ణయ స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అంపైర్ ఒకసారి ఇచ్చిన నిర్ణయాన్ని వెంటనే మార్చే అవకాశం కూడా MCC చట్టాల్లో ఉంది. అయితే ఆ మార్పు వెంటనే చేయాలి, మరికొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. ఆ తర్వాత అంపైర్ నిర్ణయం ఫైనల్‌గా ఉంటుంది. అందుకే భారత్-జపాన్ మ్యాచ్‌లో జరిగిన ఈ వైడ్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.


