టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియబోతోంది. అక్టోబర్ 4తో ఆయన కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే పదవీకాలం ముగియడానికి ముందు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ భవిష్యత్తు విషయంలో జరిగిన పరిణామాలు అప్పట్లో క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రోహిత్ కొనసాగడంపై అగార్కర్ ఆసక్తిగా లేరని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. రోహిత్‌కు బీసీసీఐ బహిరంగంగా మద్దతు ఇవ్వడంపై కూడా అగార్కర్ అసంతృప్తిగా ఉన్నారని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న సమయంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అసలు విషయము ఏమిటంటే.. అగార్కర్ పదవీకాలంలో అశ్విన్ కూడా టీమ్ నుంచి పక్కకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయినప్పటికీ అగార్కర్ తీసుకున్న నిర్ణయాలను అశ్విన్ ప్రశంసించాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్.. అగార్కర్‌తో తనకు మంచి పరిచయం ఉందని చెప్పాడు. తన రిటైర్మెంట్ సమయంలో అగార్కర్‌కు ఫోన్ చేసి తాను రిటైర్ అవుతున్నట్లు చెప్పానని అశ్విన్ వెల్లడించాడు. అగార్కర్ తనతో మాట్లాడినప్పుడు.. అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని చెప్పినట్లు అశ్విన్ తెలిపాడు. అయితే అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అశ్విన్ చెప్పాడు.
ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లను నెమ్మదిగా జట్టు నుంచి పక్కకు తప్పించి, కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం అంత సులభమైన విషయము కాదని అన్నాడు. “ఆ సీనియర్ ఆటగాళ్లలో నేనూ ఒకడిని. అయినప్పటికీ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి చూస్తే.. అగార్కర్ చాలా మంచి చీఫ్ సెలెక్టర్” అని అశ్విన్ చెప్పాడు. అగార్కర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ.. అవి వ్యక్తిగత ఇష్టాయిష్టాల కోసం తీసుకున్నవి కావని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
అతని ప్రధాన లక్ష్యం భారత జట్టుకు తర్వాతి తరం ఆటగాళ్లను సిద్ధం చేయడమేనని చెప్పాడు. జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలవడంతో పాటు.. భవిష్యత్తు కోసం బలమైన టీమ్‌ను తయారు చేయడం కూడా సెలెక్టర్ బాధ్యతేనని అశ్విన్ స్పష్టం చేశాడు. అందుకే అగార్కర్ విషయంలో వ్యక్తిగత సంబంధాల కంటే.. ఆయన తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని చూడాలని అశ్విన్ చెప్పాడు. “ఆ విషయంలో అగార్కర్ ఎలాంటి తప్పు చేయలేదు” అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి.


