Top 5 This Week

Related Posts

అర్జున్–సచిన్ టెండూల్కర్ పోలికలపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందన: “ఇలా పోల్చడం సరైంది కాదు”

క్రికెట్‌లో తండ్రి ఒక లెజెండ్ అయితే.. అదే రంగంలోకి వచ్చిన కొడుకుపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే విషయంపై మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌లో ఇప్పటికే ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్ల కుమారులు కూడా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సీనియర్ క్రికెట్ ఆడుతున్న vishayamu తెలిసిందే. అలాగే రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కూడా భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే తండ్రులు క్రికెట్‌లో సాధించిన విజయాలతో వారి కుమారులను పోల్చడం వల్ల యువ ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. తండ్రులు క్రికెట్ ఆడారు, గొప్పగా రాణించారు, ఇప్పుడు వారి పిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి పోలికలు రావడం సహజమేనని అన్నారు. కానీ తండ్రులతో పోల్చడం మాత్రం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లను ఇతర క్రికెటర్లతో పోల్చవచ్చు కానీ.. వారి తండ్రులతో ఎందుకు పోల్చాలి అని సెహ్వాగ్ ప్రశ్నించారు. ముఖ్యంగా తన కుమారుడు ఆర్యవీర్ ఇంకా కేవలం 18 ఏళ్ల వయసులోనే క్రికెట్ కెరీర్‌ను ప్రారంభిస్తున్నాడని, తాను తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినా..

ఆర్యవీర్ ఇప్పుడే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడని చెప్పారు. అందుకే తనతో పోల్చడం సరైంది కాదని అన్నారు. ఇదే సందర్భంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి కూడా సెహ్వాగ్ మాట్లాడారు. అర్జున్‌ను కేవలం సచిన్ కుమారుడు అనే కారణంతో సచిన్‌తో పోల్చడం సరైంది కాదని చెప్పారు. అర్జున్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఆటతీరును కలిగి ఉన్నాడని, రంజీ ట్రోఫీలో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూడా సాధించాడని సెహ్వాగ్ గుర్తుచేశారు. అతను తన సొంత గుర్తింపు తెచ్చుకుంటాడని, తనకునచ్చిన విధంగా క్రికెట్ ఆడతాడని అన్నారు.

ముందుగా యువ ఆటగాళ్లను క్రికెట్ ఆడనివ్వాలని, వారు తమ ప్రతిభను నిరూపించుకున్న తర్వాతే ఇతరులతో పోల్చడం గురించి ఆలోచించాలని సెహ్వాగ్ సూచించారు. ఇక ఆర్యవీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తరఫున 109 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ అతను జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. భారత్ ఈ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తండ్రి ఎంత పెద్ద క్రికెటర్ అయినా.. కొడుకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles