భారత క్రికెట్లో మరో సంచలనం సృష్టించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ భారత జట్టులో చోటు దక్కించుకున్న అతడు, ఐర్లాండ్‌తో రెండు టీట్వంటీ లు మరియు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వైట్‌బాల్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్లో ప్రారంభమయ్యే ఈ పర్యటన అతని అంతర్జాతీయ కెరీర్‌కు తొలి అడుగుగా నిలవనుంది.
అయితే ఈ టూర్లో ప్రత్యేకత ఏమిటంటే, వైభవ్ ఒంటరిగా ప్రయాణించడు. అతని తల్లిదండ్రులు కూడా అతనితో పాటు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో సీనియర్ జట్టులోకి వచ్చిన ఆటగాడికి కొత్త వాతావరణంలో అలవాటు పడేందుకు, మానసికంగా ధైర్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
సైకియా మాట్లాడుతూ, దశాబ్దాల తర్వాత వైభవ్ లాంటి యువ ప్రతిభ భారత జట్టులోకి వచ్చాడని, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి చిన్న వయసులోనే జాతీయ జట్టులో అడుగుపెట్టాడని గుర్తు చేశారు. ఇంత చిన్న వయసులో ఉన్న ఆటగాడు సీనియర్ జట్టులో భాగమైతే సహజంగానే కొన్ని సవాళ్లు ఎదురవుతాయని, అందుకే అతనికి కుటుంబ సభ్యుల మద్దతు అవసరమని చెప్పారు.
జట్టులోని మిగతా ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ పెద్దవాళ్లే కావడంతో వైభవ్‌కు మొదట్లో కొంత అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉందని బీసీసీఐ భావించింది. తల్లిదండ్రులు పక్కన ఉంటే అతడు మరింత ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా తన ఆటపై దృష్టి పెట్టగలడని అధికారులు నమ్ముతున్నారు. భారత క్రికెట్ భవిష్యత్తుకు అతడు ఎంతో విలువైన ఆస్తి అని బీసీసీఐ భావిస్తోంది.
వైభవ్ ఎదుగుదల నిజంగా అద్భుతం. ఐపీఎల్ 2026 సీజన్లో అతడు 776 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 237.31 స్ట్రైక్‌రేట్‌తో 72 సిక్సర్లు బాదుతూ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనలే అతడికి భారత జట్టులో చోటు దక్కేలా చేశాయి.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వైభవ్‌ను ప్రశంసిస్తూ, తన ఆటతోనే ఎంపిక కమిటీని ఒప్పించాడని అన్నారు. అతడిలో ఉన్న ప్రతిభ అసాధారణమని, అవకాశం వస్తే భారత జట్టు కోసం కూడా అదే స్థాయి ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. బెల్ఫాస్ట్లో అతడు అరంగేట్రం చేస్తే, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి భారత తరఫున ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించనున్నాడు.


