వసీం అక్రమ్ బిగ్ కామెంట్.. మాజీ టీమిండియా స్టార్‌పై ఎందుకు అసంతృప్తి? పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో వసీం అక్రమ్ ఒకరు. తన కెరీర్‌లో 460 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అక్రమ్.. టెస్టులు, వన్డేల్లో కలిపి ఏకంగా 916 వికెట్లు తీశారు. వేగం, స్వింగ్, బౌలింగ్‌లో అద్భుతమైన వేరియేషన్స్‌తో ప్రపంచంలోని టాప్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టేవారు.
అయితే అక్రమ్ రిటైర్ అయిన తర్వాత.. అతని బౌలింగ్ యాక్షన్‌ను గుర్తు చేసేలా బౌలింగ్ చేసిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. ఇర్ఫాన్ పఠాన్ పేరు తప్పకుండా వస్తుంది. 2003లో ఆస్ట్రేలియాపై టెస్ట్ డెబ్యూ చేసిన ఇర్ఫాన్ పఠాన్.. తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా అతని బౌలింగ్ యాక్షన్ వసీం అక్రమ్ యాక్షన్‌ను పోలి ఉండేది. తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 301 వికెట్లు తీసిన ఇర్ఫాన్.. టీమిండియా బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక అక్రమ్‌లాగే ఇర్ఫాన్ కూడా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ చెప్పిన తర్వాత కామెంటరీలోకి వచ్చాడు. ప్రస్తుతం క్రికెట్ అనలిస్ట్‌గా కూడా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. వసీం అక్రమ్ తాజాగా ఇర్ఫాన్ పఠాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. 2004లో ఇర్ఫాన్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు తొలిసారి తనను కలిశాడని అక్రమ్ తెలిపారు. ఇర్ఫాన్ తనకు పెద్ద అభిమాని అని, చిన్నప్పటి నుంచి తమ ఆటను చూస్తూ పెరిగాడని చెప్పారు.
ఇర్ఫాన్‌కు అప్పట్లో కొన్ని బౌలింగ్ టిప్స్ కూడా ఇచ్చానని అక్రమ్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా బౌలింగ్‌లో మైండ్‌సెట్, రిస్ట్ పొజిషన్, బ్యాటర్‌ను ఎలా అర్థం చేసుకోవాలి, ఎప్పుడు వేరియేషన్స్ ఉపయోగించాలి వంటి విషయాల గురించి చెప్పానన్నారు. అయితే ఇర్ఫాన్‌పై ప్రశంసలు కురిపించిన అక్రమ్.. ఒక విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ ఇప్పటికీ తనను కలుస్తుంటాడని చెప్పిన అక్రమ్.. “అతను పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తుంటాడు” అంటూ కామెంట్ చేశారు.
అయితే దీనికి పాకిస్థాన్ అభిమానులు కూడా వెంటనే స్పందిస్తారని అక్రమ్ అన్నారు. వారు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టే మనస్తత్వంతో ఉండరని, వెంటనే రిప్లై ఇస్తారని చెప్పారు. ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై ఉండే భారీ హైప్ గురించి కూడా అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం క్రికెట్ మ్యాచ్‌లేనని, ఒకరు గెలుస్తారు..
మరొకరు ఓడిపోతారని, ఆ తర్వాత మరో మ్యాచ్‌కి వెళ్లిపోవాలని అభిమానులకు సూచించారు. ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ రివెంజ్ అంటూ మాట్లాడటం ఎందుకని అక్రమ్ ప్రశ్నించారు. మొత్తానికి.. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ టాలెంట్‌ను ప్రశంసించిన వసీం అక్రమ్, పాకిస్థాన్‌పై అతని సోషల్ మీడియా పోస్టుల విషయంలో మాత్రం తన అసంతృప్తిని బయటపెట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



how dare you to talk like that about our indian player