భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీని భారత జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఆకిబ్ నబీకి ఇదే తొలి భారత జట్టు పిలుపు. దేశీయ క్రికెట్‌లో ఆకిబ్ నబీ అద్భుత ప్రదర్శన చేశాడు. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో కలిపి 104 వికెట్లు పడగొట్టాడు.
అందులో 2025-26 సీజన్‌లో ఒక్కటే 60 వికెట్లు సాధించి జమ్మూ కాశ్మీర్ జట్టుకు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో కూడా ఆకిబ్ నబీ చోటు దక్కించుకున్నాడు. అక్కడ రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. బుమ్రా విషయానికి వస్తే… మొదట అనుకున్నదానికంటే అతని మోకాలి వాపు మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని స్పోర్ట్స్ సైన్స్ బృందం అతడిని త్వరగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావాలని తొందరపడడం లేదు. ముందున్న బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతే బుమ్రాను మైదానంలోకి దింపాలని నిర్ణయించింది.
గత నెల లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో కూడా గాయం కారణంగా బుమ్రా ఆడలేదు. ఇప్పుడు శ్రీలంక టెస్ట్ సిరీస్‌ను కూడా కోల్పోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ హామ్‌స్ట్రింగ్ గాయాలతో కనీసం తొలి టెస్ట్‌కు దూరమయ్యారు. మరోవైపు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పైనా ఇంకా స్పష్టత లేదు. దీంతో తొలి టెస్ట్ కు ముందు భారత జట్టులో గాయాల సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా భారత జట్టును నడిపించనున్నారు. బుమ్రా స్థానంలో వచ్చిన ఆకిబ్ నబీ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.


