పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌కు సైబర్ క్రైమ్, ఏజెన్సీ నుంచి సమన్లు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సమన్లను సవాల్ చేస్తూ, రిజ్వాన్ ఏకంగా లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు. అసలు రిజ్వాన్ ఎందుకు కోర్టుకు వెళ్లాడు? ఈ వ్యవహారం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ 3-0తో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత, జట్టు ఆటగాళ్లపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే, N C C I A మహ్మద్ రిజ్వాన్‌తో పాటు ఇమామ్-ఉల్-హక్కు సమన్లు జారీ చేసింది. గత వారం గురువారం ఇద్దరూ లాహోర్‌లోని N C C I A కార్యాలయానికి వెళ్లి అధికారుల ముందు హాజరయ్యారు.
ఆ తర్వాత వారికి పలు పేజీల ప్రశ్నావళిని ఇచ్చి, గడువులోగా సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఇమామ్-ఉల్-హక్ తన సమాధానాలను సెప్టెంబర్ 15లోపు సమర్పించినట్లు సమాచారం. అయితే రిజ్వాన్ మాత్రం ఈ విచారణపై కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తాడు. తనపై అసలు ఏదైనా ప్రత్యేక ఆరోపణ ఉందా? తనను విచారించే అధికారం N C C I A కి ఉందా? అంటూ రిజ్వాన్ ప్రశ్నించాడు. అంతేకాదు, సోమవారం లాహోర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. N C C I A ఇచ్చిన ప్రశ్నావళిలో ఆటగాళ్ల ప్రయాణ వివరాలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత సమాచారం, కెరీర్‌కు సంబంధించిన వివరాలను అడిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విచారణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటే, P C B చేపట్టిన అంతర్గత విచారణకు సంబంధం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇదిలా ఉంటే, ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తనకు సంబంధించిన మీడియా కథనాలపై P C B కూడా అంతర్గత విచారణ ప్రారంభించింది. ఈ విచారణ బోర్డు నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలిపింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ 194 పరుగుల,తేడాతో ఓడిపోయిన తర్వాత రిజ్వాన్, ఇమామ్ సహా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించి ఇంటికి పంపించారు. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు జరిగాయి.
అయినప్పటికీ మూడో టెస్ట్‌లో కూడా పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ పర్యటనలో రిజ్వాన్ బ్యాటింగ్ కూడా ఆశించిన స్థాయిలో సాగలేదు. అతను ఆడిన రెండు టెస్టుల్లో 12, 41, 7, 1 పరుగులు చేశాడు. అయితే వికెట్ కీపర్‌గా మాత్రం అతనికి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రిజ్వాన్‌పై ప్రత్యేకంగా ఎలాంటి ఆరోపణ ఉందనే విషయము స్పష్టంగా తెలియలేదు. ఇదే విషయాన్ని అతను హైకోర్టులో ప్రశ్నించాడు. ఇప్పుడు లాహోర్ హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలా స్పందిస్తుంది? N C C I A విచారణ ఏ దిశగా వెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.


