2027 వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలని టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కోరుకుంటున్నాడు. అంతేకాదు.. వాళ్లిద్దరూ కలిసి భారత్‌కు వరల్డ్ కప్ అందిస్తే అది దేశం మొత్తం గుర్తుండిపోయే గొప్ప క్షణం అవుతుందని రింకూ చెప్పాడు. విరాట్, రోహిత్ ఇద్దరూ లెజెండ్స్ అని చెప్పిన రింకూ.. తనకే కాదు, దేశం మొత్తం వాళ్లిద్దరూ 2027 వరల్డ్ కప్‌లో ఆడాలని కోరుకుంటోందని అన్నాడు. ఒకవేళ అదే వాళ్ల చివరి వరల్డ్ కప్ అయితే.. భారత్ కోసం ట్రోఫీ గెలవడం వాళ్లకు, దేశానికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు. 2011 తర్వాత భారత్ వన్డే వరల్డ్ కప్ గెలవలేదని గుర్తు చేసిన రింకూ..
ఈసారి విరాట్, రోహిత్ జట్టుతో ఉండి ట్రోఫీని గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే రింకూ తన గురించి కూడా ఒక ముఖ్యమైన విషయము చెప్పాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడంతో రింకూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. కానీ తన కెరీర్‌ను కేవలం ఆ ఐదు సిక్సర్లతో మాత్రమే గుర్తుంచుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. టీమిండియాతో కలిసి వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి.. ఆ విజయంతో తనను ప్రజలు గుర్తించాలని రింకూ కోరుకుంటున్నాడు. ఇక తనను కేవలం T20 ప్లేయర్‌గా చూడొద్దని కూడా రింకూ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం భారత్ తరఫున వన్డేల్లో 2 మ్యాచ్‌లు, T20ల్లో 48 మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో మాత్రం వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతున్నానని చెప్పాడు. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలన్నది కూడా తన కల అని రింకూ వెల్లడించాడు. మూడు ఫార్మాట్లలోనూ ఆడగలనని, తనను సింగిల్ ఫార్మాట్ ప్లేయర్‌గా చూడకూడదని చెప్పాడు. కెప్టెన్సీ గురించి కూడా రింకూ తన ఆలోచనలను పంచుకున్నాడు. యూపీ లీగ్‌లో తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఛాంపియన్‌గా నిలిచానని చెప్పాడు.
గత ఐపీఎల్ సీజన్లో వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నానని తెలిపాడు. అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్ల నుంచి కెప్టెన్సీ విషయాల్లో నేర్చుకుంటున్నానని రింకూ చెప్పాడు. తన లీడర్షిప్ స్కిల్స్‌ను ఇంకా మెరుగుపరుచుకుంటున్నానని తెలిపాడు. చివరగా తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న రింకూ.. ఒకప్పుడు తన దగ్గర ఏమీ లేదని, ఇప్పుడు టీమిండియా వరకు వచ్చానని చెప్పాడు. తాను సాధించిన ప్రతిదీ దేవుడి ఆశీర్వాదమే అని భావిస్తున్నానని తెలిపాడు. మరి 2027 వరల్డ్ కప్‌లో విరాట్, రోహిత్‌తో కలిసి రింకూ సింగ్ కూడా టీమిండియాకు వరల్డ్ కప్ అందించగలడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.


