కెనడాలో జరిగే ప్రముఖ GT20 Canada లీగ్‌కు భారీ మార్పు వచ్చింది! ఇప్పటివరకు కెనడాలో జరిగిన ఈ టోర్నమెంట్.. వచ్చే సీజన్లో మాత్రం కరేబియన్‌కు షిఫ్ట్ కానుంది! అసలు ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎక్కడ మ్యాచ్‌లు జరగనున్నాయి? 2026 సీజన్లో ఎన్ని జట్లు ఆడనున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం! GT20 Canada 2026 టోర్నమెంట్‌ను కెనడా క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కలిసి కొత్త భాగస్వామ్యంతో నిర్వహించనున్నాయి. ఈ లీగ్‌లో గతంలో క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఆడారు. 2024లో జరిగిన చివరి సీజన్లో టొరంటో నేషనల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2026 సీజన్ మాత్రం కెనడాలో జరగదు. ఒక్క సీజన్ కోసం కరేబియన్‌లోని సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్కు GT20 Canada తరలిపోతోంది!
అసలు ఎందుకు ఇలా చేశారు అంటే.. కెనడా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలను మరింత బలపరచడం ఈ మార్పులో ప్రధాన ఉద్దేశం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకారం.. ICC లో పూర్తి సభ్యత్వం ఉన్న దేశంగా, అసోసియేట్ దేశాల క్రికెట్ అభివృద్ధికి సహాయం చేయడం కూడా తమ బాధ్యతలో భాగమే. అందుకే కెనడా క్రికెట్‌తో కలిసి ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం ద్వారా ఆటగాళ్లు, అభిమానులు, నిర్వాహకులు, కమర్షియల్ భాగస్వాముల మధ్య మరింత సంబంధం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇక 2026 GT20 Canada సీజన్‌కు వేదిక కూడా ఖరారైంది! ఈసారి మ్యాచ్‌లు సెయింట్ విన్సెంట్‌లోని కింగ్స్టౌన్లో ఉన్న ఆర్నోస్ వేల్ స్టేడియంలో జరగనున్నాయి. మరో ముఖ్యమైన విషయము ఏమిటంటే.. గతంలో GT20 Canada సాధారణంగా జూన్-జూలై లేదా జూలై-ఆగస్టు సమయంలో జరిగేది. కానీ 2026లో మాత్రం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య టోర్నమెంట్ నిర్వహించనున్నారు.
2018లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటివరకు నాలుగు సీజన్లు కెనడాలో జరిగింది. మొదటి సీజన్లో క్రిస్ గేల్‌కు చెందిన వాంకోవర్ నైట్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత విన్నిపెగ్ హాక్స్, మాంట్రియల్ టైగర్స్, టొరంటో నేషనల్స్ ఛాంపియన్లుగా నిలిచాయి. 2020 నుంచి 2022 వరకు మాత్రం టోర్నమెంట్ జరగలేదు. 2025 సీజన్ కూడా నిర్వహణకు సంబంధించిన సమస్యల కారణంగా రద్దైంది. ఇప్పుడు 2026లో కొత్త మార్పులతో GT20 Canada తిరిగి వస్తోంది. అయితే ఈసారి ఆరు జట్లకు బదులుగా కేవలం ఐదు జట్లు మాత్రమే టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అంటే.. కెనడాలో పుట్టిన ఈ టోర్నమెంట్ తొలిసారి కరేబియన్ గడ్డపై జరగబోతోంది. అయితే ఇది కేవలం 2026 సీజన్‌కు మాత్రమే. 2027లో GT20 Canada మళ్లీ తన అసలు వేదిక అయిన కెనడాకు తిరిగి వెళ్లనుంది.


