ఐర్లాండ్ క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది! ఐర్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ ఎడ్ జాయిస్‌ను ఆ దేశ పురుషుల జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు. క్రికెట్ ఐర్లాండ్ సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాబోయే కీలక సిరీస్‌లు, 2027 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌కు ఐర్లాండ్ సిద్ధమవుతున్న సమయంలో జాయిస్ బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ఎడ్ జాయిస్‌కు ఐర్లాండ్ క్రికెట్‌తో చాలా కాలంగా అనుబంధం ఉంది. 1997లో ఐర్లాండ్ తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుగుతున్న సమయంలో కీలక బ్యాటర్‌గా నిలిచారు.
ఐర్లాండ్ తరఫున మొత్తం 151 మ్యాచ్‌లు ఆడి 5,552 పరుగులు చేశారు. ఇందులో 10 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐర్లాండ్ తరఫున 2,602 పరుగులు చేసిన జాయిస్, 40.03 సగటుతో బ్యాటింగ్ చేశారు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2011, 2015 వన్డే వరల్డ్ కప్‌లలో కూడా ఆయన ఐర్లాండ్ జట్టులో భాగంగా ఉన్నారు. 2018లో తన అంతర్జాతీయ ఆటగాడి కెరీర్‌కు ముగింపు పలికారు. అయితే జాయిస్ కెరీర్ ఐర్లాండ్‌తోనే పరిమితం కాలేదు. ఇంగ్లాండ్ తరఫున కూడా ఆయన 17 వన్డేలు, రెండు టీ twenty మ్యాచ్‌లు ఆడారు. అంటే రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఆయనకు ఉంది.
ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచింగ్‌లోకి వచ్చిన జాయిస్‌కు ఐర్లాండ్ సెటప్‌పై ఇప్పటికే మంచి అవగాహన ఉంది. 2019లో ఐర్లాండ్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఆరు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన ఆయన, 2025లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ఆటగాళ్ల టెక్నిక్, కాన్ఫిడెన్స్, గేమ్ డెవలప్‌మెంట్‌పై పనిచేశారు. ఇక 2026లో క్రికెట్ ఐర్లాండ్ హై పెర్ఫార్మెన్స్ కమిటీలో కూడా చేరిన జాయిస్, ఇప్పుడు పురుషుల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు.
అయితే ఆయనకు మొదటి అసైన్‌మెంట్ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా పూర్తిగా స్పష్టంగా లేదు. 2027 జనవరిలో ఐర్లాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ T twenty లు, వన్డే ట్రై-సిరీస్ ఉండేలా గతంలో ప్రణాళికలు ఉన్నాయి. అయితే జింబాబ్వే పాకిస్థాన్‌కు వెళ్లడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది.


