Top 5 This Week

Related Posts

శ్రీలంక వార్మప్‌లో జైస్వాల్ రెండు బంతులకే డక్! లెఫ్ట్ ఆర్మ్ పేస్ దెబ్బ మళ్లీ!

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్! స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే రెండు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్‌లో మరోసారి జైస్వాల్ ఇబ్బంది పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొలంబోలో శ్రీలంక క్రికెట్ XI తో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. రెండో రోజు శ్రీలంక క్రికెట్ XI తమ ఓవర్‌నైట్ స్కోర్ 363 పరుగుల వద్ద 8 వికెట్లకు డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చారు.

అయితే టీమిండియా ఇన్నింగ్స్ మొదలైన వెంటనే పెద్ద ట్విస్ట్ ఎదురైంది. శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన రెండో బంతికే జైస్వాల్ అవుటయ్యాడు. అసలు ఏం జరిగిందంటే… విశ్వ ఫెర్నాండో వేసిన బంతి ఆఫ్ స్టంప్‌కు కాస్త బయటగా వెళ్లింది. ఆ బంతిని ఆడేందుకు జైస్వాల్ తన కాళ్లను ముందుకు కదపలేదు. శరీరానికి దూరంగా బ్యాట్‌ను ఊపడంతో బంతి బ్యాట్‌కు తగిలి గల్లీలో ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది.

దీంతో జైస్వాల్ కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇది కేవలం ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో జరిగిన చిన్న తప్పిదమేనా? లేక జైస్వాల్‌కు ఉన్న పాత సమస్య మళ్లీ బయటపడిందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్‌లో జైస్వాల్ గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు జైస్వాల్ ఇప్పటివరకు తొమ్మిది సార్లు అవుటయ్యాడు. ఇందులో గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనే మూడు సార్లు అవుటయ్యాడు.

ఆ మూడు సందర్భాల్లోనూ సౌతాఫ్రికా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సెన్ జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ సిరీస్‌లో టీమిండియా 0-2తో ఓడిపోయిన విషయము తెలిసిందే. మార్కో జాన్సెన్ మాత్రమే కాదు… ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, సౌతాఫ్రికా బౌలర్ నాండ్రే బర్గర్ కూడా టెస్టుల్లో జైస్వాల్‌ను మూడేసి సార్లు అవుట్ చేశారు. అంటే లెఫ్ట్ ఆర్మ్ పేస్ జైస్వాల్‌కు ఒక సవాల్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన, ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అదే తరహాలో అవుట్ కావడంతో, జైస్వాల్ బ్యాటింగ్‌పై మరోసారి చర్చ మొదలైంది.అయితే ఇది కేవలం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే. ఒక్క ఇన్నింగ్స్‌తో జైస్వాల్ సామర్థ్యాన్ని నిర్ణయించడం సరైంది కాదు. అయితే టెస్టు సిరీస్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఇదే బలహీనతను టార్గెట్ చేస్తే మాత్రం జైస్వాల్‌కు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles