Top 5 This Week

Related Posts

2027 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా వన్డే స్పిన్ అస్త్రంగా అక్షర్ పటేల్!

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అక్షర్ పటేల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టులో అతని పాత్ర మరింత బలపడినట్లు సమాచారం. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో అక్షర్ పటేల్ బ్యాట్‌తో అజేయంగా 57 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అంతేకాదు బంతితో 4 వికెట్లు తీసి 62 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ప్రదర్శన విలువ కేవలం మ్యాచ్ గెలిపించడంలో మాత్రమే కాదు.

2027 దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు భారత ప్రధాన స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌ను సిద్ధం చేసే ప్రణాళికకు ఇది మరింత బలం చేకూర్చిందని సమాచారం. గత కొన్ని నెలలు అక్షర్‌కు అంత సులభంగా సాగలేదు. టీట్వంటీ ల్లో అతని ఫామ్ కాస్త తగ్గింది. అంతేకాదు ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అయినప్పటికీ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ నిర్ణయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఒకప్పుడు రవీంద్ర జడేజాను కూడా వెనక్కి నెట్టి భారత వైట్‌బాల్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన అక్షర్, 2024 టీట్వంటీ ప్రపంచకప్ విజయంలో కూడా ముఖ్యపాత్ర పోషించాడు. ఇప్పుడు టీ ట్వంటీ ల్లో ఫామ్ కాస్త తగ్గినా… వన్డేల్లో మాత్రం భారత జట్టు పూర్తిగా అక్షర్‌పైనే నమ్మకం ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, భారత సెలెక్టర్లు రవీంద్ర జడేజాను మళ్లీ తొలి ఎంపిక స్పిన్నర్‌గా తీసుకోవాలనే ఆలోచనలో లేరట.దానికి కారణం కూడా ఉంది.దక్షిణాఫ్రికా పిచ్‌లపై అదనపు పేసర్లతో ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటింగ్ కూడా చేయగల స్పిన్నర్ అవసరం. అక్షర్ పటేల్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. దీంతో జట్టులో ముగ్గురు లేదా నలుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకునే అవకాశం ఉంటుంది.బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ… “జడేజా గత కొంతకాలంగా వైట్‌బాల్ క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ టర్నింగ్ పిచ్‌ల కారణంగా అవకాశం ఇచ్చాం. అలాగే అతని పవర్ హిట్టింగ్ కూడా 2019 ప్రపంచకప్ సమయంలో ఉన్నంత ప్రభావవంతంగా లేదు”అని వెల్లడించినట్లు సమాచారం.

అంతేకాదు…”దక్షిణాఫ్రికాలో భారత జట్టుకు ఒక ప్రధాన స్పిన్నర్ చాలు. వాషింగ్టన్ సుందర్ ఆడితే అదనపు బలం. అందుకే అక్షర్ ఫామ్ చాలా కీలకం. అతనికి బ్యాకప్‌గా హర్ష్ దూబేను కూడా సిద్ధం చేస్తున్నాం” అని ఆ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.అక్షర్ పటేల్ కూడా తన ఫామ్ గురించి నిజాయితీగా స్పందించాడు. టీట్వంటీ ల్లో తాను అవసరానికి మించి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించడం వల్ల తన ఆట దెబ్బతిన్నట్లు చెప్పాడు.”ఈ ప్రదర్శన నాకు చాలా అవసరం. టీ twenty ల్లో నేను బంతిని చాలా బలంగా కొట్టాలని ప్రయత్నించాను. దాంతో నా బ్యాటింగ్ రిథమ్ కోల్పోయాను. కానీ ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించడంతో భాగస్వామ్యాన్ని నిర్మించడంపైనే దృష్టి పెట్టాను”అని అక్షర్ తెలిపాడు. తన కెరీర్ మొత్తం రవీంద్ర జడేజా నీడలోనే సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.బర్మింగ్‌హామ్‌లో చేసిన ప్రదర్శనతో భారత జట్టులో అతనికి మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles