Top 5 This Week

Related Posts

“వైభవ్ సూర్యవంశీ సహా యువ ఆటగాళ్లను నేలపై ఉంచండి.. గౌతమ్ గంభీర్‌కు ఏబీ డివిలియర్స్ సూచన!”

భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా టీ ట్వంటీ సిరీస్‌లను కోల్పోవడంతో మాజీ దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ చేతిలో 0 – 4 తో వైట్‌వాష్ కావడం భారత జట్టుకు గట్టి హెచ్చరిక అని ఆయన అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఏబీ డివిలియర్స్, “ఇప్పుడు అందరి చూపు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పైనే ఉంటుంది. ఈ జట్టును మళ్లీ సరైన దారిలో నడిపించే బాధ్యత ఆయనదే. అందుకు కావాల్సిన అనుభవం, నాయకత్వ లక్షణాలు గంభీర్‌కు ఉన్నాయి” అని పేర్కొన్నాడు.

అలాగే ఈ ఓటములు భారత జట్టుకు చెడు కంటే మంచి పాఠమే కావొచ్చని డివిలియర్స్ అన్నాడు. ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేసిన యువ ఆటగాళ్లను మళ్లీ వాస్తవ పరిస్థితులకు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించాడు. “ఐపీఎల్‌లో చాలా మంది బ్యాటర్లు వరుసగా పరుగులు చేసి ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా భిన్నం. ఇక్కడ ప్రతి బౌలర్ నాణ్యమైనవాడే. దాచుకునే అవకాశం ఉండదు. అందుకే ఆటగాళ్లను మళ్లీ నేలపైకి తీసుకురావాలి. అంతర్జాతీయ స్థాయి ఎంత కఠినమో వారికి అర్థమయ్యేలా చేయాలి” అని డివిలియర్స్ చెప్పాడు.

అతను మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. “ఐపీఎల్‌లో ఒకటి లేదా రెండు బలహీన బౌలర్లపై దాడి చేయొచ్చు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అలాంటి అవకాశం ఉండదు. ప్రతి ఓవర్‌లో నాణ్యమైన బౌలింగ్ ఎదురవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఒకే విధంగా దూకుడుగా ఆడటం కుదరదు. పరిస్థితులకు తగ్గట్టు గేర్ మార్చడం నేర్చుకోవాలి” అని వివరించాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనలు చేశారు.

ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో సంచలనం సృష్టించాడు. అయితే అదే ఫామ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగించలేకపోయాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో వైభవ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 15 పరుగుల మార్కును దాటలేకపోయాడు. సంజూ శాంసన్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. భారత్ 0-4తో సిరీస్ కోల్పోవడం తనకు బాధ కలిగించిందని డివిలియర్స్ అన్నాడు.

అయితే యువ జట్టులో అనుభవం కొరవడటం కూడా దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. “ఈ ఫలితం చూడటం బాధాకరం. కానీ పూర్తిగా ఊహించని విషయం కాదు. జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో కోచ్, నాయకత్వం పాత్ర చాలా కీలకం. గౌతమ్ గంభీర్‌పై విమర్శలు రావడం సహజమే. కానీ ఇది ఒక్క ఆయన తప్పు కాదు. కొత్త జట్టుకు సమయం ఇవ్వాలి. ఓపికతో ముందుకు తీసుకెళ్తే ఈ యువ ఆటగాళ్లే భవిష్యత్తులో భారత జట్టును విజయాల బాటలో నడిపిస్తారు” అని ఏబీ డివిలియర్స్ ముగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles