మేజర్ లీగ్ క్రికెట్ 2026లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ చరిత్ర సృష్టించింది. క్వాలిఫయర్ 1లో సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి, తొలిసారి MLC ఫైనల్లోకి అడుగుపెట్టింది. ముందుగా టాస్ గెలిచిన సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆండ్రే ఫ్లెచర్ కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత కాలిన్ మున్రో జట్టును నిలబెట్టాడు. అతను 44 బంతుల్లో 51 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్లాడు.
మరోవైపు ఆండ్రే రస్సెల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 50 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో రోవ్‌మన్ పావెల్ మైదానంలోకి వచ్చి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు బాదాడు. రస్సెల్‌తో కలిసి చివరి 19 బంతుల్లోనే 57 పరుగులు జోడించాడు. దీంతో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు మొదటి నుంచే భారీ ఎదురుదెబ్బ తగిలింది.
సునీల్ నరైన్ తొలి మూడు బంతుల్లోనే ఇద్దరు కీలక బ్యాటర్లను అవుట్ చేసి ప్రత్యర్థిని 2 వికెట్లకు ఒక్క పరుగుకే పరిమితం చేశాడు. అయితే కెప్టెన్ మాథ్యూ షార్ట్, సంజయ్ కృష్ణమూర్తి అద్భుతంగా పోరాడారు. ఇద్దరూ కలిసి 151 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మళ్లీ యూనికార్న్స్ వైపు తిప్పే ప్రయత్నం చేశారు. మాథ్యూ షార్ట్ 62 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సంజయ్ కృష్ణమూర్తి 47 బంతుల్లో 65 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు.
కానీ చివరి ఓవర్లలో షాడ్లీ వాన్ షాల్క్విక్ కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మళ్లీ నైట్ రైడర్స్ వైపు తిప్పాడు. దీంతో సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేసి, కేవలం 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ అద్భుత విజయంతో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తమ చరిత్రలో తొలిసారి MLC ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు ఓడిపోయిన సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. ఇప్పుడు ఎలిమినేటర్ విజేతతో ఛాలెంజర్ మ్యాచ్ ఆడి, ఫైనల్ చేరేందుకు మరో అవకాశం పొందనుంది.
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన రోవ్‌మన్ పావెల్ మాట్లాడుతూ… ఇది మొత్తం జట్టు కష్టానికి వచ్చిన ఫలితమని చెప్పాడు. మున్రో, రస్సెల్ మంచి పునాది వేయడంతో తాను స్వేచ్ఛగా ఆడగలిగానని తెలిపాడు. ఈ ఫ్రాంచైజీ గతంలో ప్లే ఆఫ్స్‌కే చేరలేదని, ఇప్పుడు నేరుగా ఫైనల్లో ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇక ఫైనల్లో కూడా ఇదే జోష్‌తో ఆడి ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.


