Top 5 This Week

Related Posts

విరాట్ వివాదంపై ట్రావిస్ హెడ్ మౌనం వీడాడు.. భార్యకు వచ్చిన ట్రోలింగ్‌పై ఎమోషనల్ కామెంట్స్!

క్రికెట్ ప్రపంచంలో కూడా చిన్న చిన్న సంఘటనలు పెద్ద వివాదాలుగా మారిపోతుంటాయి. తాజాగా అలాంటి ఒక ఘటనపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తొలిసారి స్పందించాడు. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ అనేక ప్రచారాలు జరిగాయి. అయితే ఈ వార్తలన్నింటికీ ట్రావిస్ హెడ్ తాజాగా చెక్ పెట్టాడు.

కోడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “మా ఇద్దరి మధ్య సర్దుకోవాల్సిన విషయము ఏమీ లేదు. పోటీలో ఎలా ఉంటామో అలాగే జరిగింది. అందులో ఆశ్చర్యపడాల్సిన విషయము ఏమీ లేదు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా మా మధ్య ఎలాంటి సమస్య లేదు” అని స్పష్టం చేశాడు. అయితే ఈ వివాదం కేవలం మైదానానికే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెసికా డేవీస్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సందేశాలు పంపారు. దీనిపై కూడా హెడ్ స్పందించాడు.

“నేను, జెసికా ఇలాంటి విషయాలను చాలా ప్రశాంతంగా తీసుకుంటాం. ఇదే ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచం. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మాకు కంటే మా కుటుంబ సభ్యులే ఎక్కువగా బాధపడ్డారు. వాళ్లు ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడలేదు” అని హెడ్ తెలిపాడు. అలాగే తన భార్యను ప్రశంసిస్తూ, “జెసికా ఈ మొత్తం పరిస్థితిని చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఇలాంటి విషయాలు కొన్ని రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ కుటుంబ సభ్యులకు వాటిని అర్థం చేయించడం, వాళ్లను ధైర్యం చెప్పడం మాత్రం కాస్త కష్టమే” అని చెప్పాడు.

ట్రావిస్ హెడ్ వ్యాఖ్యలతో విరాట్ కోహ్లీతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని మరోసారి స్పష్టమైంది. మైదానంలో పోటీ వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు అనే సందేశాన్ని కూడా ఆయన ఇచ్చాడు. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను అహ్మదాబాద్ వేదికగా ఓడించి వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles