చెన్నై సూపర్ కింగ్స్ మాజీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు, కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ అయిన ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఇంగ్లండ్ రెడ్ బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా, ఎంపికయ్యే రేసులో ముందంజలో ఉన్నారని బ్రిటన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఆ నివేదిక ప్రకారం, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియలో స్టీఫెన్ ఫ్లెమింగ్ అందరి కంటే మెరుగైన ప్రదర్శన చేశారని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు ఆయనే మొదటి ఎంపికగా నిలిచారు. ఈ పదవి కోసం మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ జోనాథన్ ట్రాట్, ప్రస్తుతం ఇంగ్లండ్ పురుషుల జట్టు పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా ఉన్న రిచర్డ్ డాసన్ కూడా పోటీలో ఉన్నారు. అయితే వారందరినీ వెనక్కి నెట్టి ఫ్లెమింగ్ ముందంజలో ఉన్నారని నివేదిక పేర్కొంది. ఫ్లెమింగ్ నియామకం ఖరారైతే, ఆయన బ్రెండన్ మెకల్లమ్ స్థానాన్ని భర్తీ చేస్తారు.
ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లండ్ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మెకల్లమ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే మెకల్లమ్ పూర్తిగా కోచింగ్ బాధ్యతలకు దూరం కావడం లేదు. ఆయన ఇంగ్లండ్ వైట్ బాల్ జట్లకు హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. దీంతో టెస్ట్ జట్టుకు ఫ్లెమింగ్, వన్డేలు మరియు టీ twenty జట్లకు మెకల్లమ్ కోచ్‌లుగా కలిసి పని చేసే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. బ్రెండన్ మెకల్లమ్ తన టెస్ట్ కెరీర్‌ను స్టీఫెన్ ఫ్లెమింగ్ కెప్టెన్సీలోనే ప్రారంభించారు. అంతేకాకుండా తన క్రికెట్ జీవితంలో ఫ్లెమింగ్ తనకు ముఖ్యమైన మార్గదర్శకుల్లో ఒకరని మెకల్లమ్ కూడా గతంలో అనేకసార్లు చెప్పారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల టెస్ట్, వైట్ బాల్ జట్ల కోచింగ్ వ్యవస్థల మధ్య మంచి సమన్వయం ఉంటుందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికారు.
దాదాపు 18 సంవత్సరాల పాటు సీఎస్కే మరియు దాని అనుబంధ ఫ్రాంచైజీలైన టెక్సాస్ సూపర్ కింగ్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లతో కలిసి పనిచేశారు. ఈ కాలంలో ఫ్లెమింగ్ ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపి చరిత్ర సృష్టించారు. సీఎస్కేను ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఇదిలా ఉండగా, వచ్చే నెలలో ఇంగ్లండ్ తమ స్వదేశంలో పాకిస్థాన్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అయితే ఆ సిరీస్‌కు స్టీఫెన్ ఫ్లెమింగ్ వెంటనే బాధ్యతలు చేపట్టే అవకాశం లేదని సమాచారం.
నివేదిక ప్రకారం, ఫ్లెమింగ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించే వరకు మాజీ కెప్టెన్ జో రూట్ తాత్కాలికంగా జట్టును నడిపించే అవకాశం ఉంది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఫ్లెమింగ్ పూర్తి స్థాయిలో, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ నియామకం అధికారికంగా ఖరారైతే, ప్రపంచ క్రికెట్లో ఇదొక పెద్ద కోచింగ్ మార్పుగా నిలవనుంది. 2027 యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ తమ టెస్ట్ జట్టును మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, అనుభవజ్ఞుడైన స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


