Top 5 This Week

Related Posts

“2022 తర్వాత ఒక్క వన్డే కూడా ఆడని భారత స్టార్‌ను 2027 ప్రపంచకప్ జట్టులో తీసుకోవాలని ఆర్. అశ్విన్ అభిప్రాయం!”

టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి కీలక సూచనలు చేశాడు. చాలాకాలంగా భారత వన్డే జట్టుకు దూరంగా ఉన్న అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను తప్పకుండా ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022లో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వన్డే జట్టులో చోటు దక్కలేదు. అయినప్పటికీ అతని అనుభవం, స్వింగ్ బౌలింగ్ సామర్థ్యం 2027 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అశ్విన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 28 వికెట్లు తీసి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.

ఇదే ప్రదర్శన అశ్విన్‌ను కూడా ఆకట్టుకుంది. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ అశ్విన్…”భువనేశ్వర్ కుమార్‌ను నేను ఖచ్చితంగా ఎంపిక చేస్తాను. ఇప్పటి నుంచే అతనితో మాట్లాడాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీతో పాటు అన్ని టోర్నీల్లో ఆడేలా చూడాలి. దక్షిణాఫ్రికా పరిస్థితులకు అతన్ని సిద్ధం చేయాలి. అక్కడ అతని అనుభవం భారత జట్టుకు చాలా అవసరం అవుతుంది.” అని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లపై స్వింగ్, సీమింగ్ బౌలింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అందుకే భువనేశ్వర్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ భారత జట్టుకు పెద్ద బలమవుతాడని అశ్విన్ భావిస్తున్నాడు.

ఇక ఇదే సందర్భంగా శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌పై కూడా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. అశ్విన్ ప్రకారం… రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ తుది జట్టులో ఉండాలని తెలిపాడు. అలాగే ఏడో స్థానంలో సారాంశ్ జైన్ ను ఆడించాలని సూచించాడు. దీంతో భారత బ్యాటింగ్ బలంగా ఉండటంతో పాటు, స్పిన్ విభాగం కూడా మరింత పటిష్టమవుతుందని వివరించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇక భారత జట్టుకు మరో శుభవార్త కూడా ఉంది.

టెన్నిస్ ఎల్బో గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా మళ్లీ టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అలాగే మానవ్ సుతార్ కూడా తన స్థానం నిలబెట్టుకోగా, కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉండటంతో స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది. అశ్విన్ ప్రత్యేకంగా సాయి సుదర్శన్ గురించి కూడా ప్రస్తావించాడు.”సాయి సుదర్శన్ ఫిట్‌గా ఉండటం భారత జట్టుకు చాలా ముఖ్యం. ఇటీవల ఇండియా-ఏ తరఫున గాలేలోనే సెంచరీ చేశాడు. అక్కడి పరిస్థితులపై అతనికి మంచి అవగాహన ఉంది.

శ్రీలంక స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం అతనికి ఉంది. అతను ఫిట్‌గా ఉంటే భారత్‌కు అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.” అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి… 2027 ప్రపంచకప్‌కు భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి తీసుకురావాలని అశ్విన్ చేసిన సూచన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles