భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడికి భారీ బాధ్యత దక్కింది. 2026-27 దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీని సెలెక్టర్లు నియమించారు. ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ పేరు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడంపై క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ఇదే విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు.
హర్షా భోగ్లే తన ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాశారు…”వైభవ్ సూర్యవంశీని సీనియర్ రెడ్‌బాల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎందుకు నియమించారో నాకు అర్థం కావడం లేదు. రెడ్‌బాల్ క్రికెట్లో అతను ఇప్పటివరకు కేవలం 12 ఇన్నింగ్స్ మాత్రమే ఆడి 207 పరుగులు చేశాడు. అతని సగటు 17.25 మాత్రమే. అతనిలో అసాధారణ ప్రతిభ ఉంది. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అతను తన లెర్నింగ్ కర్వ్ ప్రారంభ దశలోనే ఉన్నాడు.” అని పేర్కొన్నారు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం అతనికి ఇంకా పెద్దగా అనుభవం లేదు.ఇప్పటివరకు వైభవ్ 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 207 పరుగులు చేశాడు.
ఇందులో అతని అత్యధిక స్కోర్ 93 పరుగులు. సెంచరీ మాత్రం ఇంకా నమోదు కాలేదు. దులీప్ ట్రోఫీలో అతను అనుభవజ్ఞుడైన బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ ద్వారా రెడ్‌బాల్ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం వైభవ్‌కు లభించనుంది. ఈస్ట్ జోన్ జట్టులో మరో విశేషం ఏమిటంటే… భారత స్టార్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ కూడా చోటు దక్కించుకున్నారు. వీరి అనుభవం జట్టుకు పెద్ద బలంగా మారనుంది.
ఈస్ట్ జోన్ జట్టు ఇలా ఉంది…ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, విరాట్ సింగ్, కుమార్ కుశాగ్ర, శిఖర్ మోహన్, సుభ్రాంశు సేనాపతి, అభిజిత్ సర్కార్, అనుకుల్ రాయ్, డెనిష్ దాస్. ఇప్పుడు అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇంత చిన్న వయసులో వచ్చిన ఈ భారీ బాధ్యతను అతను ఎలా నిర్వహిస్తాడు? రెడ్‌బాల్ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకుంటాడా? లేక హర్షా భోగ్లే చెప్పినట్లుగా ఇంకా అనుభవం అవసరమా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.


