హార్దిక్ పాండ్యా కోసం CSK కీలక ఆటగాళ్లను వదులుకుంటుందా? అశ్విన్ సంచలన హెచ్చరిక! హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్ ప్రస్తుతం IPL లో హాట్ టాపిక్‌గా మారాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే హార్దిక్‌ను CSK లోకి తీసుకోవాలంటే కొంతమంది కీలక ఆటగాళ్లను ట్రేడ్‌లో భాగంగా వదులుకోవాల్సి రావచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ CSK కు కీలక హెచ్చరిక చేశారు. ముఖ్యంగా శివమ్ దూబేను హార్దిక్ కోసం వదులుకోవద్దని అశ్విన్ సూచించారు.
IPL 2026 లో శివమ్ దూబే ఆశించిన స్థాయిలో రాణించలేదు. అతను 9 ఇన్నింగ్స్‌లలో కేవలం 203 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోర్ 47 నాటౌట్. ఫీల్డింగ్‌లో కూడా కొన్ని తప్పిదాలు చేయడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. అయితే ఒక సీజన్‌లో ఫామ్ సరిగ్గా లేదని దూబేను వదులుకోవడం మాత్రం CSK చేసే పెద్ద తప్పిదం కావచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు. దూబేను CSK నుంచి విడుదల చేస్తే.. మరో జట్టులో అతను మరింత ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దూబే భారత క్రికెట్‌లో ఒక అరుదైన ఆటగాడని అశ్విన్ పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్‌గా భారీ సిక్సర్లు, లాంగ్ షాట్లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. ఇలాంటి పవర్ హిట్టింగ్ చేయగల ఎడమచేతి బ్యాటర్లు భారత్‌లో చాలా తక్కువగా ఉన్నారని అశ్విన్ అన్నారు. అందుకే ప్రస్తుతం దూబే ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. అతడి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని CSK అతడిని కొనసాగించడమే మంచిదని సూచించారు. ఇక హార్దిక్ పాండ్యా ట్రేడ్‌లో మరో పెద్ద సమస్య కూడా ఉందని అశ్విన్ చెప్పారు. హార్దిక్‌ను తీసుకోవడానికి CSK శివమ్ దూబేతో పాటు ఖలీల్ అహ్మద్, కమ్బోజ్ వంటి కీలక భారత ఆటగాళ్లను కూడా వదులుకోవాల్సి వస్తే.. జట్టు బౌలింగ్ విభాగం బలహీనపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
గతంలో ఖలీల్ అహ్మద్ CSK నుంచి విడుదల కావాలని కోరుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయని అశ్విన్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఖలీల్ పరిస్థితి ఏంటనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. CSK కి ప్రస్తుతం అతిపెద్ద సమస్య బ్యాటింగ్ కాదని.. బౌలింగ్‌లోనే ఎక్కువగా ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్ మరింత బలపడతాయి. బ్యాటింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా హార్దిక్ CSK కు ఉపయోగపడతాడు. కానీ అతడి కోసం కీలక భారత పేసర్లను వదులుకుంటే.. ఇప్పటికే బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగం మరింత సమస్యల్లో పడే అవకాశం ఉందని అశ్విన్ చెబుతున్నారు. ఒకవేళ ఖలీల్ అహ్మద్, కమ్బోజ్ వంటి భారత పేసర్లు జట్టుకు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులభం కాదని అశ్విన్ అన్నారు.
అలాంటి పరిస్థితుల్లో CSK విదేశీ బౌలర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావచ్చు. చెపాక్ పిచ్‌లో మంచి బౌన్స్‌ను ఉపయోగించుకునే జోష్ టంగ్, సోనీ బేకర్ వంటి పేసర్లను CSK టార్గెట్ చేయవచ్చని అశ్విన్ సూచించారు. అలాగే నాథన్ ఎల్లిస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అదే సమయంలో CSK ఒక మంచి భారత స్పిన్నర్‌ను కూడా తప్పకుండా టార్గెట్ చేయాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సాయి కిషోర్ పేరు కూడా చర్చలో ఉందని ఆయన పేర్కొన్నారు. అంటే హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడం ద్వారా CSK బ్యాటింగ్, ఫినిషింగ్‌లో బలపడే అవకాశం ఉన్నప్పటికీ..
అతడి కోసం కీలక భారత బౌలర్లను వదులుకుంటే జట్టు బ్యాలెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శివమ్ దూబే విషయంలోనే అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. IPL 2026 లో దూబే పెద్దగా ప్రభావం చూపకపోయినా.. అతడిని వదిలేస్తే మరో ఫ్రాంచైజీలో మరింత ప్రమాదకరమైన ఆటగాడిగా మారే అవకాశం ఉందని అశ్విన్ హెచ్చరించారు. అందుకే హార్దిక్ పాండ్యా కోసం దూబేను వదులుకోవడం నిజంగా CSK చేసే ఖరీదైన తప్పిదం అవుతుందా అనే చర్చ మొదలైంది. హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ఆల్‌రౌండర్ జట్టులోకి రావడం CSK కు ఖచ్చితంగా ప్లస్ పాయింటే. కానీ ఒక ఆటగాడిని తీసుకోవడానికి జట్టు కాంబినేషన్‌ను మొత్తం మార్చాల్సి వస్తే.. దాని ప్రభావం వచ్చే సీజన్‌లో కనిపించే అవకాశం ఉంటుంది.
అందుకే హార్దిక్‌ను తీసుకునే ముందు అతడి కోసం ఎవరిని వదులుకోవాలి, ఆ ఆటగాళ్ల స్థానాలను ఎలా భర్తీ చేయాలి అనే విషయాలను CSK జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కానీ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం CSK అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. హార్దిక్ కోసం శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, కమ్బోజ్ వంటి ఆటగాళ్లను కోల్పోతే CSK కు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండొచ్చని అశ్విన్ హెచ్చరిస్తున్నారు. మరి CSK ఈ ట్రేడ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


