ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా నియమితులైన స్టీఫెన్ ఫ్లెమింగ్ కు మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక హెచ్చరిక చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోనీతో కలిసి అపార విజయాలు సాధించిన ఫ్లెమింగ్‌కు, ఇంగ్లండ్‌లో మాత్రం అదే పరిస్థితులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన స్టీఫెన్ ఫ్లెమింగ్, తాజాగా ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఈ నియామకం తర్వాత మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ది టెలిగ్రాఫ్ లో రాసిన తన కాలమ్‌లో వాన్ మాట్లాడుతూ…”స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎంతో గౌరవనీయమైన కోచ్. అతను అద్భుతమైన మేనేజర్, మంచి వ్యూహకర్త కూడా. కానీ ఇంగ్లండ్‌లో అతను ఎదుర్కొనే పెద్ద సమస్య ఏమిటంటే… చెన్నైలో ఉన్నట్లుగా అతని కోసం మ్యాచ్‌ను నడిపించే ఎంఎస్ ధోనీ లాంటి కెప్టెన్ ఇక్కడ లేడు.
” అని వ్యాఖ్యానించాడు. వాన్ మాటల్లో చెప్పాలంటే… చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో ఫ్లెమింగ్ పాత్ర ఎంత ముఖ్యమో, ధోనీ పాత్ర కూడా అంతే కీలకమని ఆయన అభిప్రాయపడ్డాడు. జట్టును మైదానంలో నడిపించడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఆటగాళ్లను సమర్థంగా ఉపయోగించడం వంటి అంశాల్లో ధోనీ అసాధారణ నాయకుడని చెప్పాడు. అంతేకాదు, ఫ్లెమింగ్‌కు సీఎస్కేలో బలమైన సపోర్ట్ స్టాఫ్ కూడా ఉండేదని గుర్తు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ… “వైట్ బాల్‌ను స్వింగ్ చేయించడంలో ఎరిక్ సిమన్స్ నిపుణుడు. సీఎస్కే జట్టు వేగం కంటే నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది.
అందుకే ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో కూడా కేవలం వేగంపై ఆధారపడకుండా, నైపుణ్యం కలిగిన బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వొచ్చు.” అని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. స్టార్ బ్యాటర్ జో రూట్ ను మరోసారి టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. ఇప్పటికే 2017 నుంచి 2022 వరకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జో రూట్, మొత్తం 65 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించి 27 విజయాలు అందించాడు.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవజ్ఞుడిగా రూట్ మళ్లీ బాధ్యతలు చేపట్టడం విశేషం. 53 ఏళ్ల స్టీఫెన్ ఫ్లెమింగ్, పాకిస్థాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం అధికారికంగా ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అప్పటి వరకు మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోతిక్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే ఫ్లెమింగ్ పూర్తిస్థాయిలో జట్టుతో కలిసి పనిచేయనున్నాడు. అయితే సీఎస్కేలో ధోనీతో సాధించిన విజయాలను, ఇంగ్లండ్‌లో కూడా పునరావృతం చేయగలడా? లేక ధోనీ లాంటి నాయకుడు లేకపోవడం ఫ్లెమింగ్‌కు పెద్ద సవాలుగా మారుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


