Top 5 This Week

Related Posts

టీమిండియా కెప్టెన్సీకి సిద్ధం: స్మృతి మంధానా

టీమిండియా మహిళల స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంగ్లండ్‌పై లార్డ్స్ వేదికగా చారిత్రాత్మక టెస్ట్ విజయాన్ని అందించిన అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా “టీమిండియా కెప్టెన్సీకి నేను సిద్ధమే”అని స్మృతి స్పష్టం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్మృతి మంధానా పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ముందుగా లార్డ్స్‌లో భారత్ సాధించిన చారిత్రాత్మక టెస్ట్ విజయంపై మాట్లాడిన మంధానా, మహిళల క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ మ్యాచ్‌ను లార్డ్స్‌లో ఆడటం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పింది.

“చిన్నప్పటి నుంచే టెస్ట్ క్రికెట్ ఆడాలని కలలు కనేవాళ్లం. అలాంటి మ్యాచ్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఆడటం, అంతేకాకుండా భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం” అని మంధానా తెలిపింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించి భారత విజయానికి కీలక పాత్ర పోషించింది.ఇక గాయంతో బాధపడిన వికెట్ కీపర్ యాస్తిక భాటియాకు తాను ఎలా ధైర్యం చెప్పిందో కూడా మంధానా వివరించింది.

యాస్తిక ఏసీఎల్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో, తనకు 2017లో ఎదురైన అదే తరహా గాయం గురించి చెప్పానని తెలిపింది.ఆ గాయం తర్వాతే తన ఆటలో ఎంతో మెరుగుదల వచ్చిందని, కష్టకాలం కూడా ఒక ఆటగాడిని మరింత బలంగా మార్చగలదని యాస్తికకు వివరించానని చెప్పింది. టీ ట్వంటీ ప్రపంచకప్‌ల్లో భారత్ వరుసగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంపై కూడా మంధానా నిజాయితీగా స్పందించింది. “మనం గతంలో చేసిన తప్పుల నుంచి పూర్తిగా పాఠాలు నేర్చుకోలేదు. అదే పొరపాట్లను మళ్లీ మళ్లీ చేస్తున్నాం.

ఇప్పుడు 2028 టీట్వంటీ ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది” అని ఆమె అభిప్రాయపడింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశ్న మాత్రం కెప్టెన్సీ గురించే.టీమిండియా కెప్టెన్‌గా అవకాశం వస్తే బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమా అని అడగగా…స్మృతి ఎలాంటి సందేహం లేకుండా ఒకే మాట చెప్పింది. “అవును… ఖచ్చితంగా నేను సిద్ధమే.”ఈ ఒక్క సమాధానం ఇప్పుడు భారత మహిళల జట్టులో భవిష్యత్ కెప్టెన్సీపై పెద్ద చర్చకు దారి తీసింది.ఇక మహిళల ప్రీమియర్ లీగ్ అంటే WPL గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.WPL వల్ల ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నారని చెప్పింది. “భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ధికి జయ్ షా గారి పాత్ర ఎంతో కీలకంగా ఉంది” అని పేర్కొంది.టీమిండియా కెప్టెన్సీపై స్మృతి మంధానా చేసిన స్పష్టమైన వ్యాఖ్యలు, భవిష్యత్తులో భారత మహిళల జట్టులో నాయకత్వ మార్పుకు సంకేతాలా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles