Top 5 This Week

Related Posts

“వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారీ మార్పు? సెమీఫైనల్స్‌పై ఐసీసీ ఆలోచన!”

టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అంటే WTC ఫార్మాట్‌లో భారీ మార్పులు తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి, అంటే ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా WTCలో సెమీఫైనల్స్ ప్రవేశపెట్టే ప్రతిపాదన ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు WTC ఎలా జరుగుతుందో మీకు తెలిసిందే. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సైకిల్ ఉంటుంది. ఆ కాలంలో అన్ని జట్లు టెస్ట్ సిరీస్‌లు ఆడతాయి. చివర్లో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ఆ ఒక్క ఫైనల్ మ్యాచ్‌తోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ను నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు ఈ విధానంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన ఐసీసీ వద్ద ఉందని నివేదికలు చెబుతున్నాయి. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో WTC ఫార్మాట్‌పై కీలక చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో అత్యంత ఆసక్తికరంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి సెమీఫైనల్స్‌ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, భవిష్యత్తులో పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడే అవకాశం ఉంటుంది.

అనంతరం విజేతలు ఫైనల్‌లో తలపడతారు. దీంతో మరిన్ని జట్లకు టైటిల్ గెలిచే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో అభిమానులకు మరింత ఉత్కంఠభరితమైన టెస్ట్ క్రికెట్‌ను అందించే అవకాశం కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా, ఐసీసీ మరో కీలక అంశంపై కూడా పని చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సభ్యుడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే వంటి దేశాలకు కూడా పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది. అంటే భవిష్యత్తులో WTC మరింత విస్తరించి, ఎక్కువ జట్లు పాల్గొనే టోర్నమెంట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌లో కూడా భారీ మార్పులు ప్రతిపాదించారు.

ప్రస్తుతం 14 జట్లతో నిర్వహించే 50 ఓవర్ల ప్రపంచకప్‌ను మళ్లీ 12 జట్లకు పరిమితం చేయాలని ప్రతిపాదన వచ్చింది. అలాగే సూపర్ సిక్స్ లేదా ప్రస్తుత విధానానికి బదులుగా ‘సూపర్ సెవెన్ దశను ప్రవేశపెట్టాలని కూడా చర్చ జరుగుతోంది. ఈ మార్పులు అమలైతే, 2027 వన్డే ప్రపంచకప్ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. 2027 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీ twenty ప్రపంచకప్ విషయంలో కూడా ఐసీసీ కొత్త ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సూపర్ ఎయిట్ దశను భవిష్యత్తులో సూపర్ టెన్ గా మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. దీని ద్వారా మరిన్ని జట్లు తదుపరి దశకు చేరుకునే అవకాశం లభించవచ్చు.

ఇదిలా ఉండగా, మహిళల క్రికెట్‌కు సంబంధించి కూడా ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఆఫ్ఘన్ శరణార్థ మహిళా క్రికెటర్ల కోసం ఇప్పటికే అమలు చేస్తున్న డెవలప్‌మెంట్ పాత్‌వే ప్రోగ్రామ్ ను కొనసాగించాలని ఐసీసీ బోర్డు నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ మహిళా క్రికెటర్లు 2030 నాటికి ఐసీసీ అర్హత టోర్నీల్లో పాల్గొనేలా రోడ్‌మ్యాప్ రూపొందించే బాధ్యతను స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది.ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ రోస్ రివాజ్, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సభ్యురాలు సారా కీన్‌లను కూడా కొత్తగా చేర్చింది.ఇప్పటికే ఈ బృందంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), క్రికెట్ ఆస్ట్రేలియా, అలాగే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

మొత్తానికి, టెస్ట్ క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు WTCలో సెమీఫైనల్స్, కొత్త జట్లకు అవకాశాలు, అలాగే ప్రపంచకప్‌ల ఫార్మాట్‌లలో మార్పులు వంటి అంశాలను ఐసీసీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles