టీ twenty సిరీస్‌లో 4-0 తో ఓడిపోయిన తర్వాత టీమిండియా అద్భుతంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఒకేసారి రెండు పెద్ద రికార్డులు సృష్టించింది. మొదటగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌కు 12 ఏళ్లుగా కొనసాగుతున్న అజేయ రికార్డుకు చెక్ పెట్టింది. 2015 నుంచి ఈ మైదానంలో ఇంగ్లాండ్ వరుసగా ఏడు వన్డే మ్యాచ్‌లు గెలిచింది. న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి జట్లపై విజయాలు సాధించింది. కానీ ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఆసక్తికరమైన విషయము ఏమిటంటే… ఎడ్జ్‌బాస్టన్‌లో చివరిసారి ఇంగ్లాండ్‌ను ఓడించిన జట్టు కూడా భారత్‌నే.
2014 లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు మళ్లీ 2026 లో అదే ఘనతను పునరావృతం చేసింది. అంతేకాదు, ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఆరో వన్డే విజయం. వన్డేల్లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన అత్యంత పొడవైన విజయాల పరంపర ఇదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అద్భుతమైన ఆరంభం చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 61 పరుగులు చేసింది. దీంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ అక్కడి నుంచే భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు.
వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయేలా చేశారు. ఆ సమయంలో జో రూట్ బాధ్యతగా ఆడుతూ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లియామ్ డాసన్ కూడా 68 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ కలిసి 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ 258 పరుగుల వరకు చేరుకుంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. అతని స్పెల్ ఈ మ్యాచ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. చాలా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ 80 పరుగులు చేశాడు. అయితే కాళ్లలో క్రాంప్స్ రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
గిల్ వెళ్లిన తర్వాత భారత్ 160 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడిలో పడింది. మ్యాచ్ మళ్లీ ఇంగ్లాండ్ వైపు వెళ్లేలా కనిపించింది. కానీ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కలిసి అద్భుతంగా ఆడారు. ఇద్దరూ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా చివరి వరకు నిలబడి 102 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అక్షర్ పటేల్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు కూడా నమోదైంది.
2016 తర్వాత వన్డేల్లో 250 కి పైగా లక్ష్యాన్ని ఛేజ్ చేసిన మ్యాచ్‌లలో, రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఎవరూ 50 పరుగులు, చేయకుండా భారత్ గెలిచిన రెండో మ్యాచ్ ఇదే. అంతకుముందు 2022లో ఇంగ్లాండ్‌పై ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే భారత్ ఇలాంటి విజయం సాధించింది. మొత్తానికి టీ twenty సిరీస్‌లో ఎదురైన నిరాశను పక్కన పెట్టి, వన్డే సిరీస్‌ను భారత్ అద్భుత విజయంతో ప్రారంభించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం, అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన, వాషింగ్టన్ సుందర్ ప్రశాంతమైన బ్యాటింగ్… ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.


