Top 5 This Week

Related Posts

TG Twenty తొలి మ్యాచ్ హైలైట్స్ | ఖమ్మం ఏసెస్ సంచలన విజయం | 454 పరుగుల రన్ ఫెస్ట్ | TCL 2026

తెలంగాణ క్రికెట్ లీగ్ టీజీtwenty తొలి సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించింది. సంగీత కార్యక్రమాలు, బాణసంచా వెలుగులు, హీరో విజయ్ దేవరకొండ సందడి మధ్య ఈ లీగ్ ఘనంగా ప్రారంభమైంది.అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం తొలి మ్యాచ్. అన్విత ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య జరిగిన ఈ పోరు అభిమానులకు ఐపీఎల్‌ను గుర్తు చేసింది. ఎందుకంటే రెండు జట్లు కలిసి ఏకంగా 454 పరుగులు చేయడంతో స్టేడియంలో పరుగుల వరద పారింది.

టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ జట్టు ముందుగా ఖమ్మం ఏసెస్‌కు బ్యాటింగ్ ఇచ్చింది. కానీ ఆ నిర్ణయం సరైనదేనా అనే సందేహం వచ్చేలా ఖమ్మం బ్యాటర్లు చెలరేగిపోయారు.మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఖమ్మం జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. సాయికృష్ణారెడ్డి వరుస సిక్సర్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు వాఫి కచ్చి బౌండరీలతో పరుగుల వేగాన్ని మరింత పెంచాడు.

ఈ ఇద్దరు కలిసి పాలమూరు బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వాఫి కచ్చి కేవలం 30 బంతుల్లో 60 పరుగులు చేసి అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో పదకొండు ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి.ఇక సాయికృష్ణారెడ్డి కూడా ఏమాత్రం తగ్గలేదు. 32 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత కూడా ఖమ్మం బ్యాటింగ్ జోరు తగ్గలేదు.

మూడో స్థానంలో వచ్చిన హిమతేజ అద్భుతంగా ఆడాడు. అతడు కేవలం 24 బంతుల్లోనే 59 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. ప్రతీక్ రెడ్డి 25 పరుగులు చేయగా, కెప్టెన్ చామా మిలింద్ కూడా చివర్లో వేగంగా పరుగులు చేశాడు.దీంతో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారీగా 237 పరుగులు చేసింది. మొత్తం ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు నమోదయ్యాయి.

ఇక 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ జట్టుకు, ఓపెనర్ విఘ్నేశ్ రెడ్డి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. భారీ లక్ష్యం ఉన్నా అతను ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు.మూడో ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. మరోవైపు చైతన్య నెమ్మదిగా ఆడుతూ సహకారం అందించాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి పాలమూరు వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది.

ఈ క్రమంలో విఘ్నేశ్ రెడ్డి తన అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. అతడు కేవలం 31 బంతుల్లోనే 86 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.విఘ్నేశ్ రెడ్డి దూకుడు చూస్తే పాలమూరు జట్టు సులభంగా గెలుస్తుందేమో అనిపించింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 133 పరుగులతో బలమైన స్థితిలో నిలిచింది.

అయితే మ్యాచ్ అక్కడి నుంచే మలుపు తిరిగింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విఘ్నేశ్ రెడ్డి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. చైతన్య కూడా 35 పరుగులు చేసి వెనుదిరిగాడు.వరుసగా వికెట్లు పడటంతో పాలమూరు జట్టుపై ఒత్తిడి పెరిగింది. చివరి నాలుగు ఓవర్లలో విజయానికి 58 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఖమ్మం బౌలర్లు అద్భుతంగా బంతులు వేస్తూ పరుగులను కట్టడి చేశారు.

వేద్ రెడ్డి రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. విద్యానంద రెడ్డి కూడా మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.చివరకు పాలమూరు స్ట్రైకర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు 20 పరుగుల తేడాతో టీజీ twenty తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మొత్తంగా చూస్తే తెలంగాణ క్రికెట్ లీగ్ తొలి మ్యాచ్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించింది. భారీ సిక్సర్లు, వేగంగా వచ్చిన పరుగులు, ఉత్కంఠభరిత పోరు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తొలి మ్యాచ్ ఇంత రసవత్తరంగా సాగడంతో రాబోయే మ్యాచ్‌లపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు రంగారెడ్డి రైజర్స్‌తో అనురాగ్ నల్గొండ నైట్స్ తలపడనుండగా, రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు వరంగల్ వారియర్స్‌తో మెదక్ ఫాల్కన్స్ తలపడనున్నాయి.

మరి టీజీ twenty తొలి మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles