ఐపీఎల్‌లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా భయపెట్టేలా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. ప్యాట్ కమిన్స్ లాంటి స్టార్ బౌలర్ కూడా వైభవ్ కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశామని చెప్పిన విషయము తెలిసిందే. కానీ అతడి విధ్వంసకర బ్యాటింగ్‌కు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా శ్రీలంక-ఎ జట్టుపై ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత్-ఎకు అద్భుత విజయాన్ని అందించాడు.
గతంలో లీగ్ దశలో శ్రీలంక బౌలర్ విషేన్ హలంబాగే వైభవ్‌ను కవ్వించిన ఘటన కూడా జరిగింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ పెద్దగా రాణించలేకపోయినా.. ఫైనల్‌లో మాత్రం తన అసలు సత్తా చూపించాడు. కవ్వింపులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పినట్లు భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
వైభవ్ సెంచరీ చేసేలా కనిపించినా.. శ్రీలంక కెప్టెన్ సహాన్ బౌలింగ్‌లో 94 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం ప్రియాంశ్ ఆర్య 39 పరుగులతో మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ తిలక్ వర్మ 67 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అనుకుల్ రాయ్ 39 పరుగులతో చివర్లో వేగంగా ఆడి స్కోరును 377 పరుగులకు తీసుకెళ్లాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. యశ్ ఠాకూర్ 3 వికెట్లు, విప్రాజ్ నిగమ్ 3 వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశారు. అనుకుల్ రాయ్ కూడా 2 కీలక వికెట్లతో సత్తా చాటాడు.
శ్రీలంక బ్యాటర్లలో వనుజ సహాన్ 62 పరుగులు, సదీర సమరవిక్రమ 52 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత్-ఎ సులభంగా విజయాన్ని అందుకుంది.
ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. చిన్న వయసులోనే ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ ఆటగాడిపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. భవిష్యత్‌లో భారత జట్టుకు అతను ఎంత పెద్ద ఆస్తిగా మారతాడో చూడాలి.


