2021లో శ్రీలంక టూర్‌కు వెళ్లినప్పుడు దేవదత్ పడిక్కల్ వయసు కేవలం 21 సంవత్సరాలు. అప్పుడు అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. కానీ అప్పటినుంచే అతని ఆలోచనా విధానం చాలా ప్రత్యేకంగా ఉండేదని మాజీ క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ గుర్తు చేసుకున్నారు. మ్యాచ్ ఆడకపోయినా.. పడిక్కల్ ఎప్పుడూ ఆటను గమనిస్తూనే ఉండేవాడట. బౌలర్ ఏ బంతి వేస్తాడు? ఫీల్డ్ ఇలా ఉంటే ఏ షాట్ ఆడాలి? అనే విషయాలను ముందుగానే ఆలోచించేవాడని గౌతమ్ చెప్పారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత అదే శ్రీలంకలో.. పడిక్కల్ తన తొలి టెస్ట్ సెంచరీ మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
శ్రీలంకపై తొలి టెస్ట్‌లో భారత్ 165 పరుగులతో విజయం సాధించడంలో పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ విజయానికి వెనుక చాలా కష్టం ఉంది. భారత్, ఏ టూర్‌కు వెళ్లే ముందు తన కోచ్ మహమ్మద్ నసీరుద్దీన్‌తో పడిక్కల్ ఒక విషయము చెప్పాడు. ఎక్కడ అవకాశం వచ్చినా.. ఏ నంబర్లో బ్యాటింగ్ చేసినా.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పరుగులు చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని ప్రాక్టీస్ పూర్తిగా మారిపోయింది. శ్రీలంకలో కూకాబుర్రా బంతులతో ఆడాల్సి రావడంతో..
కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్లో కూడా కూకాబుర్రా బంతులతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పొడవైన స్పిన్నర్లు, చిన్న స్పిన్నర్లు, వేగంగా బౌలింగ్ చేసే స్పిన్నర్లు.. అలాగే ఇద్దరు ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో ప్రతి సెషన్లో ప్రాక్టీస్ చేయించారు. ఇందులో ముఖ్యమైన మార్పు అతని ఫుట్‌వర్క్. స్పిన్నర్ బంతిని క్రీజులో నిలబడి ఆడకుండా.. ముందుకు వచ్చి, బంతికి దగ్గరగా వెళ్లి డ్రైవ్ చేయడం పడిక్కల్ ప్రాక్టీస్ చేశాడు. గాలే టెస్ట్‌లో కూడా అదే కనిపించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి ఫీల్డ్‌ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత తొందరపడకుండా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇది ఒక పరిణతి చెందిన బ్యాటర్ లక్షణమని అతని కోచ్ చెప్పారు. అయితే పడిక్కల్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2021 శ్రీలంక టూర్ తర్వాత ఆరోగ్యం, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఒక దశలో క్రికెట్‌ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కడుపు సమస్యలతో పాటు ప్రత్యేక డైట్ కూడా పాటించాల్సి వచ్చింది. కానీ అతను అన్ని సమస్యలను ఎదుర్కొని మళ్లీ ఫిట్‌గా మారాడు.
అంతేకాదు.. చిన్నప్పటి నుంచే తనకు టెస్ట్ క్రికెట్ ఆడాలనే కోరిక ఉందని గౌతమ్ చెప్పారు. ఈ ఏడాది మొహాలీలో పంజాబ్‌పై రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పడిక్కల్ 85 బంతుల్లోనే, 120 పరుగులు చేసి కర్ణాటకను గెలిపించడం అతని బ్యాటింగ్‌లో ,మరో పెద్ద మార్పుకు కారణమైంది. ఇక గాలే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 230 బంతుల్లో ,167 పరుగులు చేసి స్పిన్‌ను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఓపికగా ఆడి 75 బంతుల్లో 44 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా పడిక్కల్‌కు అవకాశం వచ్చింది. పెర్త్ టెస్ట్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు, 14 టెస్టుల తర్వాత తిరిగి వచ్చిన అతను.. ఒక్క మ్యాచ్‌తోనే టీమిండియా నంబర్ 3 స్థానంపై తన హక్కును బలంగా చాటాడు.
ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!


