Top 5 This Week

Related Posts

సచిన్ రికార్డుకు జో రూట్ చేరువలో.. రెండేళ్లలోనే చరిత్ర సృష్టిస్తాడా? రిచర్డ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతాయి. అలాంటి రికార్డుల్లో సచిన్ తెందుల్కర్ సాధించిన టెస్ట్ క్రికెట్ పరుగుల రికార్డు ఒకటి. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఖాతాలో ఏకంగా 15,921 పరుగులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రికార్డుకు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చాలా దగ్గరగా వచ్చేశాడు. జో రూట్ ఇప్పటివరకు 14,208 పరుగులు చేశాడు.

అంటే సచిన్ రికార్డుకు రూట్ ఇంకా 1,713 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. రూట్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తే ఈ రికార్డు అందుకోవడం అంత కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రూట్ మరో రెండు సంవత్సరాలు ఇదే స్థాయిలో క్రికెట్ ఆడితే.. సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే విషయంపై క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా ఆసక్తికరంగా స్పందించాడు. రూట్ ఇప్పటికే గొప్ప బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకున్నాడని చెప్పిన రిచర్డ్స్..

సచిన్ రికార్డును బద్దలు కొడితే మరో ప్రత్యేక ఘనత కూడా అతడి ఖాతాలో చేరుతుందని వ్యాఖ్యానించాడు. ఎందుకంటే రూట్, జెఫ్రీ బాయ్‌కాట్ ఇద్దరూ యార్క్‌షైర్‌కు చెందిన బ్యాటర్లే. ఒకవేళ సచిన్ రికార్డును రూట్ అధిగమిస్తే.. యార్క్‌షైర్ నుంచి వచ్చిన అత్యుత్తమ బ్యాటర్ ఎవరు అనే చర్చలో రూట్ పేరు ముందుకు వస్తుందని రిచర్డ్స్ సరదాగా చెప్పాడు. ఇక రూట్ తండ్రి మ్యాట్ రూట్ కూడా తన కుమారుడి సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేశాడు.

కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా రూట్ ఒక్క ఏడాదిలోనే 1,700 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు ఉన్నా తన బ్యాటింగ్‌పై ప్రభావం పడకుండా రూట్ పరుగులు చేయగలడని అతను చెప్పాడు. అందుకే ఫిట్‌గా ఉండి, ఏకాగ్రతతో క్రికెట్ ఆడాలనే కోరిక కొనసాగితే.. సచిన్ రికార్డును రూట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మ్యాట్ రూట్ అభిప్రాయపడ్డాడు. మరి సచిన్ 15,921 పరుగుల రికార్డును జో రూట్ నిజంగానే బద్దలు కొడతాడా? లేక సచిన్ రికార్డు మరికొంత కాలం అలాగే ఉంటుందా? చూడాలి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles