Top 5 This Week

Related Posts

టీ20 చేదు జ్ఞాపకాలకు చెక్… వన్డే ప్రపంచకప్ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్న టీమిండియా!

టీ twenty సిరీస్‌లో ఘోర పరాజయాలను చవిచూసిన టీమిండియా ఇప్పుడు కొత్త ఆశలతో వన్డే క్రికెట్‌లో అడుగుపెడుతోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది. అయితే ఈ సిరీస్ కేవలం మరో ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదు… 2027 వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా ప్రయాణానికి ఇదే తొలి అడుగు. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో భారత జట్టుకు ఎదురైన ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. మొదట ఐర్లాండ్ చేతిలో రెండు టీ20 మ్యాచ్‌లు కోల్పోయిన భారత్… ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో నాలుగు టీ20ల్లో ఓడిపోయి మొత్తం ఏడు మ్యాచ్‌లలో ఆరు పరాజయాలు చవిచూసింది. దీంతో ఒక పెద్ద ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.

విదేశీ పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటంలో టీమిండియా వెనుకబడుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం ఇప్పుడు వన్డే సిరీస్ రూపంలో వచ్చింది. ఎందుకంటే మరో 15 నెలల్లో దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. అందుకే ఈ సిరీస్‌ను భారత జట్టు ఎంతో కీలకంగా తీసుకుంటోంది. గత రెండేళ్లుగా భారత్ వన్డేల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. శ్రీలంకలో 2-0తో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాలో 2-1తో ఓడింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా 2-1తో సిరీస్ చేజారింది. దీంతో ఇప్పుడు జట్టును మళ్లీ సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఉంది. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఇది కొత్త ఫార్మాట్. కొత్త ఆరంభం.

దక్షిణాఫ్రికాలో ఉండే పిచ్‌లు ఇక్కడి పరిస్థితులకు దగ్గరగా ఉంటాయి. అందుకే ప్రపంచకప్‌కు సరిపోయే జట్టును ఈ సిరీస్‌లో సిద్ధం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది మాకు చాలా కీలకమైన సిరీస్” అని గిల్ తెలిపాడు. అయితే జట్టు కూర్పు విషయంలో భారత్‌కు పెద్ద తలనొప్పి ఎదురైంది. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. హర్షిత్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఎంపిక చేసినప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.

బౌలింగ్ విభాగంలో గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరికి అవకాశం లభించే అవకాశం ఉంది. అలాగే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరిని తీసుకోవాలన్నదానిపై కూడా జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మార్పులపై కూడా గిల్ స్పందించాడు. “ప్రపంచకప్‌కు ముందు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలాంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఇవ్వాలని అనుకున్నాం. కానీ గాయాలతో వారు దూరమవ్వడం దురదృష్టకరం. ఇప్పుడు మళ్లీ కొత్త కాంబినేషన్‌ను ప్రయత్నించాల్సిన పరిస్థితి వచ్చింది” అని చెప్పాడు. ఇదిలా ఉంటే టీమిండియాకు భారీ ఊరటనిచ్చే విషయం ఏమిటంటే… సీనియర్ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డేల్లో బరిలోకి దిగుతున్నారు.

ఐపీఎల్ ఫైనల్ తర్వాత తొలిసారి విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతను అఫ్గానిస్తాన్ సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మకు ఇంగ్లండ్ అంటే ప్రత్యేకమైన రికార్డు ఉంది. ఇంగ్లండ్‌లో అతని వన్డే సగటు దాదాపు 65 కాగా… ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అది 89కు పైగానే ఉండటం విశేషం. ఇక జస్ప్రీత్ బుమ్రా దాదాపు 968 రోజుల తర్వాత వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. అతని రాక భారత బౌలింగ్‌కు భారీ బలం కానుంది. అయితే ఇంగ్లండ్ కూడా తక్కువేమీ కాదు

. ఎడ్జ్‌బాస్టన్‌లో వరుసగా ఏడు వన్డే మ్యాచ్‌లు గెలిచి అద్భుత రికార్డు సృష్టించింది. అదే సమయంలో భారత్ మాత్రం ఇంగ్లండ్‌పై వరుసగా ఐదు వన్డే విజయాలు నమోదు చేసింది. అంటే ఈ రెండు జట్ల విజయ పరంపరల్లో ఒకటి ఈ మ్యాచ్‌తో ముగియడం ఖాయం. అందుకే ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో భారత్‌కు విజయం సాధించడం ఎంత ముఖ్యమో… అంతకంటే ముఖ్యమైనది సరైన జట్టు కాంబినేషన్‌ను గుర్తించడం. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles