Top 5 This Week

Related Posts

అశ్విన్, వెంకటరాఘవన్, శ్రీకాంత్‌కు ఘన గౌరవం.. కారణం ఇదే!

చెన్నై క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా ఒక గర్వకారణమైన వార్త! టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు అరుదైన గౌరవం దక్కబోతోంది. అదీ కూడా ఆయన క్రికెట్ ప్రయాణానికి ఎంతో ప్రత్యేకమైన చెన్నైలోనే! M A చిదంబరం స్టేడియం… అంటే Chepauk లో అశ్విన్ పేరుతో ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అశ్విన్‌తో పాటు మరో ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాలకు కూడా ఇదే గౌరవం దక్కబోతోంది. వాళ్లు ఎవరో తెలుసా? ఎస్. వెంకటరాఘవన్, కృష్ణమాచారి శ్రీకాంత్! ఈ ముగ్గురినీ ఒకే కార్యక్రమంలో సత్కరించేందుకు TNCA ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకం కానుంది. ఎందుకంటే చెన్నైలో జరగబోయే BBL మ్యాచ్‌కు ముందు ఈ ముగ్గురు క్రికెటర్ల సమక్షంలో ఈ గౌరవ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. ఇక అశ్విన్ విషయానికి వస్తే… టీమిండియా తరఫున ఎన్నో అద్భుతమైన విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ స్పిన్నర్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్ 537 వికెట్లు సాధించాడు. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన పేరుతో చెపాక్‌లో స్టాండ్ ఏర్పాటు చేయడం ఆయన కెరీర్‌కు మరో ప్రత్యేక గుర్తింపుగా నిలవనుంది.

ఇక ఎస్. వెంకటరాఘవన్ విషయానికి వస్తే… ఆయన భారత క్రికెట్‌లో ప్రముఖ స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు. భారత్ తరఫున 57 టెస్టుల్లో 156 వికెట్లు సాధించారు. అంతేకాదు… 1975, 1979 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్ పేరు భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1980లలో తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టిన శ్రీకాంత్… 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. భారత్ తరఫున 43 టెస్టులు, 146 వన్డేలు ఆడిన శ్రీకాంత్… అంతర్జాతీయ క్రికెట్‌లో 6 వేలకుపైగా పరుగులు సాధించారు.

ఇప్పుడు ఈ ముగ్గురు తమిళనాడు క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఒకే వేదికపై సత్కారం పొందబోతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయము ఏమిటంటే… చెపాక్ స్టేడియంలో క్రికెటర్ల పేర్లతో స్టాండ్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కానుంది! ఇప్పటివరకు అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పేరుతో ఒక స్టాండ్ ఉంది. ఇక అశ్విన్ పేరుతో స్టాండ్ ఏర్పాటైతే… భారత క్రికెట్‌లో ఇప్పటికే ఇలాంటి గౌరవం పొందిన దిగ్గజాల జాబితాలో ఆయన కూడా చేరిపోతారు. అంటే… అశ్విన్‌కు ఇది కేవలం ఒక స్టాండ్ కాదు… తమిళనాడు నుంచి భారత క్రికెట్ వరకు ఆయన చేసిన సేవలకు దక్కుతున్న ఒక ప్రత్యేక గౌరవం! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles