దంబుల్లాలో జరిగిన ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మ్యాచ్ అభిమానులకు చివరి వరకు ఉత్కంఠను పంచింది. మ్యాచ్‌లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సూపర్ ఓవర్, ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్వాదాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచింది యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ చివరి క్షణాల్లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించాలా లేదా అనే విషయంపై కొంత గందరగోళం నెలకొంది. వెలుతురు కూడా తగ్గిపోతుండటంతో అంపైర్లు, మ్యాచ్ అధికారులు చర్చలు జరిపారు.
ఈ సమయంలో ఇండియా ఏ కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో మాట్లాడాడు. మ్యాచ్ ను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించాలని ఆయన పట్టుబట్టాడు. ఇదే సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా అక్కడికి వచ్చి అంపైర్లతో జరిగిన చర్చలో పాల్గొన్నాడు.చర్చలు మరింత వేడెక్కడంతో ఇండియా ఏ కోచ్ హృషీకేశ్ కనిట్కర్ జోక్యం చేసుకుని వైభవ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిలక్ వర్మ కూడా వాదన కొనసాగిస్తుండగా, వైభవ్ అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నట్లుగా కెప్టెన్‌ను పక్కకు తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే డ్రామా అక్కడితో ఆగలేదు. సూపర్ ఓవర్లో శ్రీలంక ఏ జట్టు విజయం సాధించిన తర్వాత వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇతర ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని వారిని విడదీశారు.మ్యాచ్ విషయానికి వస్తే, శ్రీలంక ఏ జట్టు విజయం సాధించింది. సాధారణ ఆటలో చివరి ఓవర్లో శ్రీలంకకు 5 పరుగులు అవసరం కాగా, భారత బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
కానీ సూపర్ ఓవర్లో అర్షద్ ఖాన్ ఖరీదైన ఓవర్ వేశాడు. ఒక వైడ్, ఒక నోబాల్ సహా శ్రీలంక ఏ జట్టు 16 పరుగులు సాధించింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్ చేశారు. అయితే శ్రీలంక పేసర్ కుగతాస్ మతులన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని కేవలం 9 పరుగులకే పరిమితం చేశాడు. దీంతో శ్రీలంక ఏ జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఓటమి ఎదురైనా వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతిభను చూపించాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక ఏపై 14 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్ ఏపై 44 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతని ప్రవర్తన కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


