క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త చరిత్ర నమోదైంది. ETPL తొలి ఛాంపియన్‌గా ఎడిన్‌బర్గ్ క్యాసిల్ రాకర్స్ నిలిచారు! మలాహైడ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మొదట టాస్ గెలిచిన ఎడిన్‌బర్గ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం వెంటనే ఫలించింది. ట్రెంట్ బౌల్ట్ ప్రారంభంలోనే పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేయడంతో బెల్‌ఫాస్ట్ ఒత్తిడిలో పడింది. అయితే ఆ తర్వాత టిమ్ టెక్టర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 62 బంతుల్లో 84 పరుగులు చేసి బెల్‌ఫాస్ట్ స్కోర్‌ను నిలబెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
మరోవైపు వికెట్లు పడుతున్నా టెక్టర్ మాత్రం స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. టెక్టర్‌కు దేవన్ కాన్వే నుంచి కూడా మంచి సహకారం లభించింది. కానీ ఎడిన్‌బర్గ్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీస్తూ బెల్‌ఫాస్ట్‌ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. చివరికి బెల్‌ఫాస్ట్ వోల్వ్స్ 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ఇక 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎడిన్‌బర్గ్ క్యాసిల్ రాకర్స్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. రాస్ అడైర్ 23 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. తర్వాత కొన్ని వికెట్లు పడటంతో ఎడిన్‌బర్గ్‌పై కాస్త ఒత్తిడి వచ్చింది. కానీ అక్కడే అసలు హీరో ఆండ్రీస్ గౌస్! గౌస్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.
61 బంతుల్లో 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అవసరమైన సమయంలో బౌండరీలు కొడుతూ, మరోవైపు వికెట్ కాపాడుకుంటూ లక్ష్యాన్ని దగ్గర చేశాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ కూడా 17 పరుగులతో సహకరించాడు. చివర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌తో కలిసి గౌస్ ఎడిన్‌బర్గ్‌ను విజయతీరాలకు చేర్చాడు. 18.4 ఓవర్లలో 151 పరుగులు చేసి ఎడిన్‌బర్గ్ క్యాసిల్ రాకర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ETPL చరిత్రలో తొలి ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ తర్వాత గౌస్ మాట్లాడుతూ, ఫైనల్‌లో చివరి వరకు క్రీజులో ఉండాలని ముందే నిర్ణయించుకున్నానని చెప్పాడు.
టోర్నీలో ఇంతకుముందు మంచి ఆరంభాలు వచ్చినా భారీ స్కోర్ చేయలేకపోయానని, కానీ ఫైనల్‌లో తన ప్లాన్‌ను అమలు చేయగలిగానని తెలిపాడు. ఎడిన్‌బర్గ్ కోచ్ ట్రెవర్ బేలిస్ కూడా తమ జట్టు టోర్నీలో అద్భుతంగా కలిసిపోయిందని చెప్పాడు. స్థానిక ఆటగాళ్లు కూడా మంచి ప్రతిభ చూపించారని ప్రశంసించాడు. ఇక టీమ్ సహ యజమాని కైల్ మిల్స్ మాట్లాడుతూ, స్థానిక ఆటగాళ్లు కూడా ప్రపంచంలోని పెద్ద ఫ్రాంచైజీ టోర్నీల్లో ఆడే స్థాయి కలిగి ఉన్నారని చెప్పాడు. టిమ్ టెక్టర్ 84 పరుగులతో బెల్‌ఫాస్ట్‌కు బలమైన స్కోర్ అందిస్తే.. ఆండ్రీస్ గౌస్ 90 పరుగుల నాటౌట్‌తో ఎడిన్‌బర్గ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అలా తొలి ETPL ట్రోఫీని అందుకున్న జట్టు పేరుగా ఎడిన్‌బర్గ్ క్యాసిల్ రాకర్స్ చరిత్రలో నిలిచిపోయింది!


