“ఎంత మంచిగా క్రికెట్ ఆడినా.. ఓ పెద్ద టోర్నమెంట్ గెలవకుండా మహిళల క్రికెట్లో మార్పు గురించి మాట్లాడలేం”.. గతేడాది టీమ్ ఇండియా జగజ్జేతగా నిలిచిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పిన మాట ఇది..! కోట్లాది మంది క్రికెట్ అభిమానులుండే మన దేశంలో మహిళా క్రికెటర్లు తమను తాము నిరూపించుకునేందుకు మాత్రం ఎన్నో ఏళ్లు పట్టింది. ఆ గుర్తింపు తెచ్చిన మేటి క్రికెటర్లలో హర్మన్ ప్రీత్ (Harmanpreet Kaur) ఒకరు. ఆమె కేవలం ఒక కెప్టెన్ మాత్రమే కాదు.. భారత మహిళల క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన ఓ గేమ్ ఛేంజర్. అమ్మాయిల ఆటకు ఫ్యాన్ బేస్ పెంచిన ఓ పవర్ హౌస్..!
తండ్రి స్ఫూర్తితో..
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 37 ఏళ్ల హర్మన్ ప్రీత్.. తండ్రి హర్మందర్ సింగ్ ప్రోత్సాహంతో ఆటల్లో అడుగుపెట్టింది. స్వతహాగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్ అయిన హర్మందర్.. తన కుమార్తెను కూడా ఆ దిశగా నడిపించారు. క్రికెట్‌పై ఆసక్తితో హర్మన్ శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడే ఫాస్ట్ బౌలర్‌గా మైదానంలోకి అడుగు పెట్టింది. స్కూల్ యూనిఫామ్‌పై దుప్పట్టా కట్టుకొని మరీ బౌలింగ్‌కు దిగే హర్మన్‌ను చూస్తే సీనియర్ కుర్రాళ్లుకూడా భయపడేవారని చిన్ననాటి కోచ్ కమ్లదీష్ గుర్తు చేసుకున్నారు.. ఆ తర్వాత బ్యాటింగ్‌పై దృష్టిపెట్టింది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో లో అరంగేట్రం చేసింది.
అనుకోని కెప్టెన్సీతో కప్పు తెచ్చి..
అది 2012 ఆసియా కప్. ఈ టోర్నీలో ఫైనల్‌కు ముందు.. నాటి కెప్టెన్ మిథాలీ రాజ్, వైస్ కెప్టెన్ ఝులన్ గోస్వామి గాయాలతో మ్యాచ్‌కు దూరమయ్యారు. అలాంటి కీలక దశలో తాత్కాలిక సారథ్య బాధ్యతలు అందుకుంది హర్మన్ ప్రీత్. ఆమె నాయకత్వంలో టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఆసియా కప్పు సాధించింది. అప్పటికి ఆమె జాతీయ జట్టులోకి వచ్చి కేవలం మూడేళ్లే. అయినా కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే ట్రోఫీ నెగ్గి భవిష్యత్తుకు బలమైన బాటలు వేసుకుంది. 2013లో మహిళల వన్డే జట్టుకు సారథిగా ఎంపికైన ఆమె.. 2016లో టీ20 జట్టుకూ పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంది.
ఆ ఇన్నింగ్స్.. ఓ పవర్ హిట్టింగ్
2017లో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ మహిళల క్రికెట్ భవితను మార్చేసిన ఓ పవర్ హిట్టింగ్లాంటిదని చెప్పొచ్చు. ఆ మ్యాచ్‌లో కేవలం 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి టీమ్ ఇండియాను ఫైనల్‌కు చేర్చింది హర్మన్. ఇందులో 20 బౌండరీలు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్ కేవలం మ్యాచ్ ఫలితాన్ని మాత్రమే మార్చలేదు. మహిళల క్రికెట్‌పై అంచనాలను మార్చేసింది. కోట్లాది మంది అభిమానులను కూడగట్టింది.
దూకుడుకు కేరాఫ్ అడ్రస్..
పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లి దూకుడు ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. మహిళల క్రికెట్లో అలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్ హర్మన్ ప్రీత్. మైదానంలో చురుగ్గా కదులుతూ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఆమె గణాంకాలను చూస్తే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మిడిలార్డర్ బ్యాటర్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో హర్మన్ ఇప్పటివరకు 8వేలకు పైగా పరుగులు సాధించింది. మహిళల టీ20లో శతకం చేసిన తొలి భారత క్రికెటర్ ఈమే. పొట్టి ఫార్మాట్లో 3వేలకు పైగా పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. విదేశీ ప్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మహిళా క్రికెటర్ కూడా హర్మన్ కావడం విశేషం. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌కు ఆడింది.
విమర్శలకు ట్రోఫీతో బదులిచ్చి..
- తన సుదీర్ఘ కెరీర్లో హర్మన్ నాయకత్వంపై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ఆమె కెప్టెన్సీలో పస లేదన్న మాటలూ వినిపించాయి. వీటన్నింటికి గతేడాది వరల్డ్‌కప్ ట్రోఫీతో గట్టిగా బదులిచ్చిందామె..! 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాను జగజ్జేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది.
- హర్మన్ ప్రీత్.. భారత్‌కు కేవలం విజయాలు, ట్రోఫీలు మాత్రమే అందించలేదు. తన నాయకత్వంతో మహిళా క్రికెట్‌ను పునర్నిర్వచించింది. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తూ మహిళా క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ఈ ప్రయాణంలో తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా ముగించి నేడు నాయకత్వ బాధ్యతలకు గర్వంగా వీడ్కోలు పలికింది.
మరికొన్ని రికార్డులు..
- హర్మన్ సారథ్యంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ టీమ్ ఇండియా రజత పతకం అందుకుంది.
- ఆమె నాయకత్వంలో ఆసియా గేమ్స్ వరుసగా రెండు సార్లు (2022, 2026) మన జట్టు స్వర్ణం సాధించింది.
- మహిళల ప్రీమియర్ లీగ్ లో 2023, 2025లో ముంబయి ఇండియన్స్ సారథిగా కప్పు కొట్టింది.
- 2017లో అర్జున అవార్డు. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకుంది.


