Top 5 This Week

Related Posts

Harmanpreet Kaur సంచలన నిర్ణయం.. Captaincyకి గుడ్‌బై!

భారత మహిళల క్రికెట్ జట్టుకు సుదీర్ఘంగా కెప్టెన్గా వ్యవహరిస్తోన్న Harmanpreet Kaur మంగళవారం సంచలన ప్రకటన చేశారు. అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. లీడర్గా తన కర్తవ్యం పూర్తయినట్లు పేర్కొన్నారు. అయితే, క్రీడాకారిణిగా మరింతకాలం కొనసాగేందుకు సిద్ధమేనని తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

“అన్ని ఫార్మాలకు కెప్టెన్ బాధ్యతల నుంచి ఈ రోజు దిగిపోతున్నా. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాల ప్రయాణం. ఆ క్షణాలు నా జీవితాంతం గుర్తుండిపోతాయి. భారత మహిళల క్రికెట్ కోసం, ఈ జట్టు కోసం నేను నా సర్వశక్తులూ ధారపోశా, నా వ్యక్తిగత ప్రదర్శన, సొంత ఆశయాలను పక్కన పెట్టాల్సి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఎందుకంటే, జట్టు ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యమని నేను భావించా. వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకుని మరీ.. కెప్టెన్గా కొన్ని సార్లు కఠిన నిర్ణయాలూ తీసుకున్నా. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం జట్టు పురోగతి, ఆటగాళ్ల మెరుగుదల కోసమే..!”

“కెప్టెన్గా నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. క్లిష్ట పరిస్థితులు, విమర్శలు, సందేహాలు, మనది కాని ఎన్నో రోజులను ఎదుర్కొన్నా. అదే సమయంలో దేశం గర్వించే విజయాలు, త్యాగాలకు దక్కిన సంబరాల వంటి అత్యుత్తమ క్షణాలను ఆస్వాదించా. ఎన్నో భావోద్వేగాలతో నిండిన హృదయంతో, ప్రశాంతమైన మనసుతో ఈ రోజు కెప్టెన్సీని వీడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మా జట్టు మంచి స్థాయిలో ఉందని నేను విశ్వసిస్తున్నా. జట్టులో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారిణులు భవిష్యత్తుపై నమ్మకం కలిగిస్తున్నారు. అందుకే, నా కర్తవ్యాన్ని నేను పూర్తిచేశానని భావిస్తున్నా.”

“ఈ నాయకత్వ బాధ్యతలను నేను ఎంతో గర్వంగా నిర్వర్తించా. భారత మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల కృతజ్ఞతగా ఉన్నా. ఇక, నా ప్రయాణంలో మరో పేజీ తిరగేయాల్సిన సమయం వచ్చింది. అయితే, నా కెప్టెన్సీ మాత్రమే పూర్తయ్యింది. క్రికెట్ పట్ల నా ప్రేమకు ఎప్పటికీ ముగింపు ఉండదు. ఈ ఆటతో నా ప్రయాణం మరింతకాలం కొనసాగుతుంది. నాయకత్వ బాధ్యత వేళ నాకు అండగా నిలిచిన జట్టుసభ్యులు, కోచ్, సపోర్ట్ స్టాఫ్, మేనేజ్ మెంట్, బీసీసీఐ, నా కుటుంబసభ్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని హర్మన్ ప్రీత్ కౌర్ రాసుకొచ్చారు.

సారథిగా మహిళల క్రికెట్కు హర్మన్ ప్రీత్ ఎన్నో విజయాలు అందించారు. గతేడాది నవంబరులో హర్మన్ సేన వన్డే వరల్డ్కప్ సాధించగా.. ఇటీవలే ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles