భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఆరంభంలో ఎదురు దెబ్బల తర్వాత శ్రేయస్ అయ్యరు జింబాబ్వే, అఫ్గానిస్థాన్ సిరీస్లలు ఉపశమనాన్ని ఇచ్చాయి. తాజాగా ఆసియా క్రీడల్లోనూ జట్టుకు ఎదురు లేకపోయింది. కానీ ఇప్పుడు మొదలయ్యే సిరీస్ మాత్రం అంత తేలిక కాదు. పొట్టి క్రికెట్లో ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న వెస్టిండీస్ పై గెలవాలంటే శ్రేయస్ సేన ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే.
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ గెలిచిన భారత్.. ఇప్పుడు టీ20 సమరానికి సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లఖ్ నవూలోని ఎకానా స్టేడియంలో మంగళవారం తొలి టీ20 జరగనుంది. భారత్‌కు వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. మూడు మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టింది వెస్టిండీస్. టీ20ల్లో కరీబియన్ జట్టు బ్యాటింగ్ మరింత ప్రమాదకరం. భారత్ తో చివరి వన్డేలో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన షై హోప్‌కు తోడు హెట్మయర్, రోమన్ పావెల్, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. వీళ్లందరూ పొట్టి క్రికెట్‌కు తగ్గట్లు చెలరేగి ఆడగలరు. హోప్ తో కలిసి కామిల్ పూరన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. రొమారియో షెఫర్డ్, షమార్ స్ప్రింగర్ రూపంలో పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ లోనూ బలమైన ముద్ర వేయగల ఆల్‌రౌండర్లు విండీస్ సొంతం. అకీల్ హొసీన్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 స్పిన్నర్లలో ఒకడు. గుడాకేశ్ మోటీ కూడా ప్రతిభావంతుడైన స్పిన్నరే. ఈ ఇద్దరూ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ చేయగలరు. మాథ్యూ ఫోర్డ్. షమార్ జోసెఫ్ కొత్త బంతిని పంచుకునే అవకాశముంది.
ఓపెనింగ్‌లో ఎవరు?: భారత జట్టుకు మరోసారి సెలక్షన్ తలనొప్పి తప్పేలా లేదు.
ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో కొంత కాలంగా సాగుతున్న కుర్చీలాట అయోమయానికి దారి తీస్తోంది. వైభవ్ సూర్యవంశీకి అవకాశమివ్వడం కోసం కొన్ని మ్యాచ్‌లో సంజు శాంసన్‌ను పక్కన కూర్చోబెట్టారు. ఇటీవల ఆసియా క్రీడల్లోనేమో ఇద్దరినీ ఆడించి, సంజును మూడో స్థానానికి పంపారు. అయితే ఆ క్రీడల్లో భారత్‌కు కోచ్‌గా వ్యవహరించింది వీవీఎస్ లక్ష్మణ్. ఇప్పుడు రెగ్యులర్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశంలోనే భారత్ ఆడనుంది. అతడు సంజును ఓపెనింగ్ లో ఆడించడానికే చూస్తాడు. లేదంటే అతణ్ని పక్కన పెడతాడు. మరి తొలి టీ20లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇద్దరూ జట్టులో ఉంటే అభిషేక్ శర్మతో కలిసి వైభవే ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. సంజు మూడో స్థానంలో ఆడతాడు. ఎవరు ఓపెనింగ్ చేసినా ధాటిగా ఆడి పవర్‌ప్లేలో పరుగుల వరదపారించాల్సిందే. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్‌కు భారీ లక్ష్యాలను నిర్దేశిస్తేనే గెలుపు సాధ్యం.
భారత్ కూడా పెద్ద లక్ష్యాలనే ఛేదించాల్సి రావచ్చు. అభిషేక క్కు తోడు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె మంచి ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. మరి విండీస్‌తో సిరీస్‌లో అయినా అతను అంచనాలకు తగ్గట్లు ఆడతాడేమో చూడాలి. అక్షర్ పటేల్ తో కుల్డీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఆసియా క్రీడల్లో అక్షర్, విండీస్‌లో వన్డే సిరీస్‌లో కులీప్ చక్కటి లయతో బౌలింగ్ చేశారు. భారత పేస్ విభాగం మాత్రం అంత బలంగా కనిపించట్లేదు. అర్షదీప్ ఒక్కడే అనుభవజ్ఞుడు. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లో ఒకరు.. అర్షదీప్తోతో కలిసి పేస్ దాడిని ఆరంభిస్తారు. వైభవ్, సంజుల్లో ఒకరినే తుది జట్టులోకి తీసుకుంటే. తెలుగు కుర్రాడు, పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో ఉంటాడు.
పిచ్ కొంచెం నెమ్మది..
ఎకానా స్టేడియం పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఐపీఎల్లో లో ఇక్కడ ఎక్కువగా భారీ స్కోర్లు నమోదు కావు. 160-170 స్కోర్లను కూడా జట్లు కాపాడుకుంటుంటాయి. అయితే మంగళవారం నాటి మ్యాచ్‌కు వికెట్ మరీ అంత కష్టంగా ఉండకపోవచ్చు. కానీ పరుగుల వరద పారే అవకాశాలు తక్కువ. ఈ పిచ్ పేసర్లకు బాగా అనుకూలిస్తుంది. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపిస్తారు. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ/ నితీశ్‌కుమార్ రెడ్డి, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, కుల్డీప్ యాదవ్, మయాంక్ యాదవ్/ప్రిన్స్ యాదవ్, ఆర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), కామిల్ పూరన్, హెట్మయర్, రోమన్ పావెల్, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్, గుడాకేశ్ మోటీ, అకీల్ హౌసీన్, మాథ్యూ ఫోర్డ్, షమార్ స్ప్రింగర్, షమార్ జోసెఫ్.


