Top 5 This Week

Related Posts

ILT20 Auctionలో బాబర్ ఆజమ్.. 17 మంది పాకిస్థాన్ ప్లేయర్స్!

ఐఎల్‌టీ20 2026 వేలంలో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా! దుబాయ్ వేదికగా అక్టోబర్ 1న జరగబోయే ఐఎల్‌టీ20 2026 వేలం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వేలంలో పాకిస్థాన్‌కు చెందిన ఏకంగా 17 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, నసీమ్ షా లాంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. ఈ 17 మందిని 80 వేల, 40 వేల, 10 వేల డాలర్ల ప్రారంభ ధరల కేటగిరీలుగా విభజించారు. అసలు ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం! ముందుగా బాబర్ ఆజమ్. తొలిసారి ఐఎల్‌టీ20 వేలంలోకి వచ్చిన బాబర్.. ఏకంగా 80 వేల డాలర్ల కేటగిరీలో ఉన్నాడు.

టీ20 క్రికెట్‌లో 359 మ్యాచ్‌లు ఆడి 12,493 పరుగులు చేసిన బాబర్.. ఈ వేలంలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇక ఫఖర్ జమాన్, నసీమ్ షా, ఉస్మాన్ తారిఖ్ ఇప్పటికే ఐఎల్‌టీ20లో ఆడారు. గత సీజన్‌లో డెజర్ట్ వైపర్స్ తరఫున ఆడిన ఫఖర్.. 21 మ్యాచ్‌ల్లో 482 పరుగులు చేశాడు. నసీమ్ షా 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ తారిఖ్ కూడా రెండు మ్యాచ్‌ల్లోనే 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. వీళ్ల ముగ్గురూ ఈసారి కూడా వేలంలోకి వచ్చారు. ఇక హసన్ నవాజ్ 40 వేల డాలర్ల కేటగిరీలో ఉండగా.. స్టార్ పేసర్ హసన్ అలీ 80 వేల డాలర్ల కేటగిరీలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ 40 వేల డాలర్ల కేటగిరీలో ఉండగా.. మొహమ్మద్ నవాజ్ 80 వేల డాలర్ల కేటగిరీలో ఉన్నాడు.

ఇక యువ సంచలనం సైమ్ అయూబ్ కూడా 80 వేల డాలర్ల కేటగిరీలో ఉన్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1,298 పరుగులతో పాటు 29 వికెట్లు తీసిన సైమ్.. ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ తన సత్తా చూపించాడు. ఖుష్దిల్ షా 40 వేల డాలర్ల కేటగిరీలో ఉండగా.. ఇటీవల సీపీఎల్ ఫైనల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన మాజ్ సదాఖత్ కూడా ఇదే కేటగిరీలో ఉన్నాడు. ఇక సాహిబ్జాదా ఫర్హాన్ ఏకంగా 80 వేల డాలర్ల కేటగిరీలో ఉన్నాడు. 181 టీ20 మ్యాచ్‌ల్లో 5,526 పరుగులు చేసిన అతడు.. పాకిస్థాన్‌లో మంచి టీ20 బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అబ్దుల్ సమద్, ఫర్హాన్ యూసఫ్ 40 వేల డాలర్ల కేటగిరీలో ఉండగా..

ఎడమచేతి స్పిన్నర్ సుఫ్యాన్ మొకీమ్ 80 వేల డాలర్ల కేటగిరీలో ఉన్నాడు. నసీమ్ షా తమ్ముడు హునైన్ షా 40 వేల డాలర్ల కేటగిరీలో ఉండగా.. ఘాజీ ఘోరి మాత్రం 10 వేల డాలర్ల ప్రారంభ ధరతో ఉన్న ఏకైక పాకిస్థాన్ ఆటగాడు. మొత్తంగా చూస్తే.. బాబర్ ఆజమ్ నుంచి సైమ్ అయూబ్ వరకు 17 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు ఐఎల్‌టీ20 వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి అక్టోబర్ 1న జరిగే ఈ వేలంలో ఎవరిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles