క్రికెట్‌లో న్యాయమైన ఆటకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ స్థానిక లీగ్ మ్యాచ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో క్లిక్కీ పాంటింగ్’ పేరుతో వైరల్ అయిన ఈ ఘటనపై సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంద ఇంగ్లాండ్‌లోని సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ రెండో జట్టు, నార్టన్ జట్టుతో స్థానిక లీగ్ మ్యాచ్ ఆడుతోంది. మ్యాచ్‌లో ఒక బ్యాటర్ షాట్ ఆడిన సమయంలో బంతి బ్యాట్‌ను తాకలేదని వీడియోలో కనిపించినా, ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు తన వేళ్లను చిటికేసి బ్యాట్‌కు బంతి తగిలినట్లు శబ్దం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ శబ్దం విన్న అంపైర్, బ్యాటర్ ఎడ్జ్ ఇచ్చాడని భావించి ఔట్ ప్రకటించాడు. వికెట్‌కీపర్ కూడా క్యాచ్ పట్టడంతో బ్యాటర్ వెనుదిరిగాడు.
అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా వేళ్లను చిటికేసినట్లు కనిపించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు నెటిజన్లు ‘క్లిక్కీ పాంటింగ్’అనే పేరు పెట్టారు. ఈ వీడియో కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం X (ట్విట్టర్) వేదికలో ఈ వీడియోకు 75 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పలువురు మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వివాదం పెద్దదిగా మారడంతో సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.క్లబ్ మాట్లాడుతూ…”ఈ ఆరోపణలను మేము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మా క్లబ్ కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థ. ప్రస్తుతం NYS లీగ్ నిర్వహిస్తున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాం” అని తెలిపింది.
అంతేకాదు, ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని వెంటనే సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. “దర్యాప్తు పూర్తయ్యే వరకు అతను ఈ సీజన్‌లోనే కాదు, భవిష్యత్తులో కూడా క్లబ్ తరఫున ఆడడు” అని స్పష్టం చేసింది. ఈ వివాదం ప్రభావం క్లబ్‌పైనా పడింది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కారణంగా తమ రెండో జట్టు మార్టన్ జట్టుతో జరగాల్సిన కప్ మ్యాచ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు క్లబ్ ప్రకటించింది. క్లబ్ అధికారులు ఇప్పటికే లీగ్ నిర్వాహకులతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ ఘటన తమకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించిందని క్లబ్ పేర్కొంది. “ఇది మాకు చాలా బాధాకరమైన అనుభవం. మా క్లబ్ పూర్తిగా వాలంటీర్లతో నడుస్తోంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మా వ్యక్తిగత హద్దులను గౌరవించాలని కోరుతున్నాం” అని క్లబ్ విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటనతో మరోసారి క్రికెట్‌లో స్పోర్ట్స్‌మన్‌షిప్, ఫెయిర్ ప్లే, నిజాయితీ ఎంత ముఖ్యమో చర్చ మొదలైంది. చిన్న క్లబ్ మ్యాచ్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్ అయినా… ఆట న్యాయంగా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై లీగ్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యాక ఆటగాడిపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

