టీమిండియా తరఫున తొలి వన్డేలోనే 55 పరుగులు చేశాడు. అదీ నాటౌట్‌గా నిలిచాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు తరఫున ఒక్క వన్డే కూడా ఆడలేకపోయాడు. అసలు ఇంత మంచి డెబ్యూ ఇచ్చిన ఆటగాడికి ఆ తర్వాత అవకాశం ఎందుకు రాలేదు? ఆ క్రికెటర్ ఎవరో తెలుసా? అతనే ఫైజ్ ఫజల్. భారత క్రికెట్‌లో ఒక ఆటగాడు టీమిండియాలోకి రావడమే చాలా కష్టం. ఎందుకంటే దేశంలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవే లేదు. ఒకసారి అవకాశం వచ్చినా.. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద సవాలు. ఫైజ్ ఫజల్ కూడా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడినా.. టీమిండియాలో తన స్థానాన్ని ఎక్కువకాలం కొనసాగించలేకపోయాడు. ఫైజ్ ఫజల్ విదర్భ, రైల్వేస్ జట్ల తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.
2015-16 సీజన్‌లో అతని బ్యాటింగ్ మరింత అద్భుతంగా సాగింది. ఆ సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫైజ్ ఫజల్ 714 పరుగులు చేశాడు. అతని సగటు 44.62గా ఉంది. అంతేకాదు.. మూడు సెంచరీలు కూడా చేశాడు. మొత్తంగా ఫైజ్ ఫజల్ 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 9,184 పరుగులు చేశాడు. అతని సగటు 41 పరుగులకు పైగానే ఉంది. ఇంత మంచి రికార్డు ఉన్నా.. టీమిండియాలోకి రావడానికి అతనికి చాలా కాలం పట్టింది. చివరకు 2016లో జింబాబ్వే పర్యటనలో ఫైజ్ ఫజల్‌కు భారత జట్టులో అవకాశం వచ్చింది. అప్పటికి అతని వయసు 30 ఏళ్లు దాటింది. దీంతో 16 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల వయసులో వన్డే డెబ్యూ చేసిన తొలి భారత ఆటగాడిగా ఫైజ్ ఫజల్ నిలిచాడు. 2016 జూన్ 15న హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫైజ్ ఫజల్ తన తొలి వన్డే ఆడాడు. భారత్ ముందు 126 పరుగుల లక్ష్యం ఉంది.
ఫైజ్ ఫజల్ ఓపెనర్‌గా వచ్చి చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేశాడు. అంతేకాదు.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. అతనితో కలిసి మరో ఎండ్‌లో KL రాహుల్ 70 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత్ ఆ మ్యాచ్‌ను సులభంగా గెలిచింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అంత మంచి డెబ్యూ ఇచ్చిన ఫైజ్ ఫజల్‌కు ఆ తర్వాత భారత జట్టులో మరో వన్డే అవకాశం రాలేదు. అంటే.. టీమిండియా తరఫున అతని కెరీర్ కేవలం ఒక్క వన్డేకే పరిమితమైంది. దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో పరుగులు చేసినా.. భారత జట్టులో మాత్రం తనకు వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని మాత్రమే ఫైజ్ ఫజల్ అందుకోగలిగాడు. చివరకు 2021 ఫిబ్రవరిలో ఫైజ్ ఫజల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
రిటైర్మెంట్ సమయంలో తన 21 ఏళ్ల ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు… నాగ్‌పూర్ మైదానంలోనే తన క్రికెట్ ప్రయాణం మొదలైందని, అదే మైదానంలో తన చివరి మ్యాచ్ ఆడటం భావోద్వేగంగా ఉందని చెప్పాడు. భారత జట్టు, విదర్భ తరఫున ఆడటం తన జీవితంలో గొప్ప గౌరవమని ఫైజ్ ఫజల్ తెలిపాడు. ఒకవైపు టీమిండియా జెర్సీ వేసుకున్న ఆనందం.. మరోవైపు ఒక్క వన్డేతోనే అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయిన బాధ. తొలి వన్డేలోనే 55 నాటౌట్.. కానీ ఆ తర్వాత టీమిండియా జెర్సీ మళ్లీ వేసుకోలేకపోయాడు ఫైజ్ ఫజల్. ఇదే భారత క్రికెట్‌లో ప్రతిభ ఉన్నా.. అవకాశాలు ఎంత విలువైనవో చెప్పే మరో కథ.


